Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తున్న జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   16 Aug 2017 4:57 AM GMT
త‌మ్ముళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తున్న జ‌గ‌న్‌
X
నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది.ఈ ఎన్నిక ఫ‌లితంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల్లో ఎంతో ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఒక సీన్ చాలా ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదే అంశాన్ని అక్క‌డి ప్ర‌జ‌ల మాట‌ల్లో త‌ర‌చూ వినిపిస్తూ ఉంది. నంద్యాల ఉప ఎన్నిక‌ను ప‌ర్స‌న‌ల్ గా తీసుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు.. త‌న మంత్రివ‌ర్గం మొత్తాన్ని నంద్యాల‌లో దించ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక ఉప ఎన్నిక కోసం బాబు మ‌రీ ఇంత‌గా శ్ర‌మించ‌ట‌మా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది.

అదే స‌మ‌యంలో.. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల మైండ్ సెట్ ను మార్చేందుకు పెద్ద ఎత్తున డ‌బ్బును ఖ‌ర్చు పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో అధికార‌ప‌క్షం ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న ప్ర‌చారం తెలుగు త‌మ్ముళ్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయ‌ని చెబుతున్నారు.

ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా అడుగుతున్న జ‌గ‌న్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక డిఫెన్స్ లో ప‌డిపోతున్నార‌ని చెబుతున్నారు. క‌ర్నూలులో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టైనా ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లు అయ్యిందా? అన్న సూటి ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేక నీళ్లు న‌ములుతున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఏపీ అధికార‌ప‌క్ష తీరును.. సీఎం చంద్ర‌బాబు మూడున్న‌రేళ్ల పాల‌న‌పైనా జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతూ.. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల్ని చేస్తున్న తీరు తెలుగు త‌మ్ముళ్ల‌కు ఓ ప‌ట్టాన అర్థం కావ‌టం లేద‌ని చెబుతున్నారు.

గ‌డిచిన ఏడు రోజులుగా అలుపెర‌గ‌ని రీతిలో నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటిని ట‌చ్ చేసేలా జ‌గ‌న్ త‌న ప్ర‌చారాన్ని సాగిస్తున్నారు. ఒక ముఖ్య‌నేత ఇంత పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌టంతో.. ఏపీ అధికార‌ప‌క్షం నేత‌ల ప్ర‌చారం పెద్ద‌గా ప్రభావం చూపించ‌లేక‌పోతుంద‌న్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. ఏపీ అధికార‌ప‌క్షంపై జ‌గ‌న్ వేస్తున్న ప్ర‌శ్న‌లకు స‌మ‌ర్థ‌వంతంగా స‌మాధానం చెప్ప‌లేక త‌మ్ముళ్లు కిందామీదా ప‌డుతున్నారు.

మూడున్న‌రేళ్ల బాబు పాల‌న‌లో మోస‌పూరిత హామీల గుట్టుర‌ట్టు చేస్తున‌న జ‌గ‌న్ తీరు అధికార‌ప‌క్ష నేత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక కానీ రాక‌పోతే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు లోకేశ్ ల‌కు.. ఏపీ మంత్రుల‌కు నంద్యాల ప‌ట్టేదా? అన్న సూటి ప్ర‌శ్న నంద్యాల ప్ర‌జ‌ల మీద ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌న్న మాట వినిపిస్తోంది.

విభ‌జ‌న సంద‌ర్భంలో ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర చంద్ర‌బాబు తాక‌ట్టు పెట్టార‌ని జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు నంద్యాల ఓట‌ర్ల‌పై ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం ఉందంటున్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వీలుగా హోదా డిమాండ్ ను వ‌దిలిపెట్టార‌ని జ‌గ‌న్ ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చే విష‌యం మొద‌లుకొని నంద్యాల‌ను అభివృద్ధి చేస్తామ‌న్న హామీతో పాటు.. ఉప ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌కుంటే అభివృద్ధి జ‌ర‌గ‌దంటూ బెదిరింపుల‌కు దిగుతున్న అధికార‌ప‌క్ష తీరును జ‌గ‌న్ ఎండ‌గ‌డుతున్న తీరుపై ఏపీ అధికార‌ప‌క్షంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు చెబుతున్నారు. అన్నీ తానై అన్న‌ట్లుగా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌చారం తెలుగు త‌మ్ముళ్ల‌కు మ‌హా ఇబ్బందిక‌రంగా మారిన‌ట్లుగా చెబుతున్నారు.