Begin typing your search above and press return to search.

వారసత్వానికి జగన్ కొత్త నిర్వచనం

By:  Tupaki Desk   |   24 Jun 2019 8:39 AM GMT
వారసత్వానికి జగన్ కొత్త నిర్వచనం
X
రచ్చబండ... ఈ పదం వైఎస్ అభిమానులకు పీడకల. ప్రజలతో మమేకమై స్వయంగా వారి సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్లాన్ చేసిన ఒక కార్యక్రమం అది. అయితే, దురదృష్టవశాత్తూ ఆ ‘‘రచ్చబండ‘‘ కార్యక్రమానికి వెళ్తూనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తిరిగిరాని లోకాలకు మరలిపోయారు. అందుకే ఆ పదం వింటే వైఎస్ అభిమానులకు దు:ఖం తన్నుకువస్తుంది. అయితే, వారసత్వం అంటే తండ్రి అధికారం దక్కించుకోవడం కాదని - తండ్రి మంచిపనులను కొనసాగించడం అని కొత్త అర్థం చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తన తండ్రి ప్రారంభించాలనుకుని ఆగిపోయిన ఆ కార్యక్రమాన్ని తాను చేపట్టి ప్రజల సమస్యలు తీరుస్తానని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అందుతున్న సేవలను తాను నేరుగా పరిశీలిస్తానని కలెక్టర్ల సమావేశంలోనే తెలిపారు.

ప్రభుత్వ అధికారులు కూడా వారానికి ఏదో ఒక రోజు ప్రభుత్వ ఆసుపత్రులు - ప్రభుత్వ హాస్టళ్లలో నిద్ర చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులు - విద్య - వైద్య రంగాలకు తనకు హై ప్రయారిటీ తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జగన్ స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే క్రమం తప్పకుండా నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ‘స్పందన’ పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని సూచించారు. ఫిర్యాదు స్వీకరిస్తే సరిపోదని సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందో వారికి తెలియజేయాలని - ఇచ్చిన సమయంలోపు పని పూర్తి చేయాలని సూచించారు. సంచలనం ఏంటంటే.. సమస్యను స్వీకరించినట్టు రశీదును వారికి ఇవ్వాలని సూచించారు. ఇవన్నీ కనుక కచ్చితంగా అమలు జరిగితే జగన్ ఇక ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు.