కడప ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ గెలుపు గెలుపేనా?

Mon Mar 20 2017 11:35:08 GMT+0530 (IST)

బలం ఉంది. బలగం ఉంది. మరి.. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి ఇప్పుడు షాకింగ్ గా మారింది. జగన్ బాబాయ్ ఎన్నికల్లో ఓడిపోవటం.. అది కూడా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటి కడప జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఇప్పుడు అందరిని విస్తుపోయేలా చేస్తోంది.

అయితే.. టీవీల్లో కనిపించే బ్రేకింగ్ న్యూస్.. వెబ్ సైట్లలో దర్శనమిచ్చే గెలుపు వార్తల్ని చూసినప్పుడు.. జగన్ పార్టీ ఓడినట్లే కనిపిస్తుంది. కానీ.. ఈ ఎన్నిక తంతు మొదలైన నాటి నుంచి పోలింగ్ జరిగినంతవరకూ ఏం జరిగిందన్న విషయాన్ని కడప గడపలో కూర్చొని చూస్తే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు అండ్ కోకు.. ఎన్నికల్లో గెలిచే ఓట్లు ఉన్న పార్టీలను ఎలా ఓడిస్తారన్న విషయం తెలిసిందే. పవర్ లేని తెలంగాణలో బుక్ అయ్యారు కానీ.. పవరున్న ఏపీలో.. బాబు అండ్ కో చెలరేగిపోయారు. అడ్డూఆపు లేకుండా వ్యవహరించటం.. విలువల్ని తుంగలోకి తొక్కిన తీరును చూసినప్పుడు.. ఒక గెలుపు కోసం ఇంతలా దిగజారాలా? అన్న భావన కలగటం ఖాయం.

హోరాహోరీగా సాగిన కడప స్థానిక సంస్థల ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి అనూహ్య పరాజయం పాలయ్యారు. అదికారపక్షం అడుగడుగునా అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో వివేక ఓటమి తప్పనిసరి అయ్యిందన్న వాదన వినిపిస్తోంది.

తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి 34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీకి 433 ఓట్లు రాగా.. వైఎస్ వివేకకు 399 ఓట్లు వచ్చాయి. మొత్తం 839 ఓట్లు పోల్ కాగా వీటిల్లో ఏడు ఓట్లు చెల్లలేదు. వాస్తవానికి కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది.

అయితే.. జగన్ అడ్డాను తమ అధీనంలోకి తెచ్చుకున్నామన్న సందేశాన్ని చాటి చెప్పటం కోసం అధికారపార్టీ ఏమేం చేయాలో అన్నీ చేసినట్లుగా చెబుతున్నారు. అన్నింటికి మించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెందిన పలువురిని ప్రలోభానికి గురి చేసి పాండిచ్చేరిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి.. నయాన.. భయానా అన్ని విధాలుగా మేనేజ్ చేయటంతో తాజా విజయం సాధ్యమైనట్లుగా సమాచారం. దాదాపు 400 మందికి పైగా సభ్యులతో ఏర్పాటు చేసిన శిబిరం పోలింగ్ కు ముందు పదిహేనురోజుల పాటు సాగినట్లుగా చెబుతున్నారు.

ఈ శిబిరాన్ని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఎంపీ సీఎం రమేశ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పాండిచ్చేరిలోని రిసార్ట్స్ లో మాక్ పోలింగ్‌ను ఒకటికి రెండుమార్లు నిర్వహించటంతో పాటు.. తమకు అనుకూలంగా ఓటు వేయటానికి ఏమేం కావాలో అవన్నీ అందించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దాదాపు 125 కోట్ల రూపాయిలకు పైనే.. ఈ ఎమ్మెల్సీ సీటును తమ వశం చేసుకోవటానికి ఏపీ అధికారపక్షం ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంత భారీగా ఖర్చు చేసిన తర్వాత.. లభించిన విజయం ఎలాంటిదన్న విషయం ఒకటైతే.. కడపలో జగన్ పార్టీని ఓడించేందుకు నీతులు చెప్పే చంద్రబాబు ఇంతగా దిగజారాలా? అన్న ప్రశ్న పలువురు సంధిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/