Begin typing your search above and press return to search.

మైండ్ బ్లోయింగ్ ఫీచ‌ర్ల‌తో..సూప‌ర్ కంప్యూట‌ర్‌

By:  Tupaki Desk   |   19 Jun 2018 12:23 PM GMT
మైండ్ బ్లోయింగ్ ఫీచ‌ర్ల‌తో..సూప‌ర్ కంప్యూట‌ర్‌
X
మైండ్ బ్లోయింగ్ ఫీచ‌ర్ల‌తో...ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌ ను అమెరికా ఆవిష్కరించింది. దీని వేగం సెకన్‌కు 200 పెటాఫ్లాప్స్. అంటే సెకన్‌ కు రెండు లక్షల ట్రిలియన్ల లెక్కలను చేయగలదు. ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు. దీనినిబట్టి సమిట్ సామర్థ్యాన్ని ఊహించుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్లను అమర్చడం వల్ల సమిట్ ఏకకాలంలో 10లక్షల జీబీ (10 పెటాబైట్స్)కన్నా ఎక్కువ సమాచారాన్ని ప్రాసెస్ చేయగలుగుతుంది. దీని అంతర్గత మెమెరీయే 25కోట్ల జీబీలు ఉండటం విశేషం. ఓక్‌ రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ (ఓఆర్ ఎన్ ఎల్) ఈ సూపర్ కంప్యూటర్‌ ను రూపొందించింది. దీనికి ఐబీఎం సంస్థ సహకారం అందించింది. దీనికి సమిట్ అని పేరుపెట్టింది.

ఇప్పటివరకు అమెరికాలోనే వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్ గుర్తింపు పొందిన టైటాన్‌ ను 2012లో త‌యారు చేశారు. ఓఆర్ ఎన్ ఎల్ - ఐబీఎం కలిసి టైటాన్ సూపర్ కంప్యూటర్‌ ను తయారుచేశాయి. దీని సామర్థ్యం 27 పెటాఫ్లాప్స్. తాజాగా ఆవిష్కరించిన సమిట్ టైటాన్ కన్నా ఎనిమిది రెట్లు శక్తివంతమైనది. దీని నిర్మాణంలో ఐబీఎం సంస్థకు చెందిన 4,608 అత్యాధునిక సర్వర్లను వినియోగించారు. ఒక్కో సర్వర్‌ లో రెండు 22 కోర్ ఐబీఎం పవర్-9 ప్రాసెసర్లను - ఆరు ఎన్‌ వీఐడీఐఏ టెల్సా వీ-100 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ యాక్సిలరేషన్స్‌ ను ఉపయోగించారు. వీటన్నింటినీ డ్యుయల్-రైల్ మెల్లనోక్స్ ఈడీఆర్ 100 జీబీ/సెకన్ ఇన్ఫినిబాండ్‌ తో అనుసంధానించారు. శాస్త్ర - సాంకేతిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి - ఆవిష్కరణలను మరింత వేగవంతం చేయడానికి సమిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని అమెరికా ఇంధనశాఖ మంత్రి రిక్ పెర్రీ పేర్కొన్నారు.

కాగా, శాస్త్రీయ ప‌రిశోధ‌న‌ల్లో త‌న ముద్ర‌ను చాటుకునేందుకు అమెరికా ఈ నిర్ణ‌యం తీసుకుంది. సమిట్ ద్వారా శాస్త్ర పరిశోధనల్లో సూపర్ కంప్యూటర్ల భాగస్వామ్యం పెరుగనుంది. కొన్ని పరిశోధన అంశాలకు సంబంధించి సమిట్ సెకన్‌ కు 300 కోట్ల కోట్ల(మూడు బిలియన్ బిలియన్లు) విశ్లేషణలు చేయగలదు. శాస్త్రీయ విశ్లేషణల్లో ఇదో రికార్డు. గతంలో టైటాన్ సెకన్‌ కు కేవలం 64 బైట్ల సైన్స్ అంశాలను మాత్రమే విశ్లేషించగలిగేది. సమిట్ సామర్థ్యాన్ని ఓఆర్ ఎన్ ఎల్ శాస్త్రవేత్తలు డాన్ జాకబ్‌ సన్ - వెయిన్ జౌబెర్ట్ పరీక్షించారు. బయోఎనర్జీ - మానవ ఆరోగ్యానికి సంబంధించిన 1.8 బిలియన్ బిలియన్ల జన్యు సంబంధ సమాచారాన్ని సమిట్‌కు అందించగా సానుకూల ఫలితాలు వచ్చాయి. సమిట్ శాస్త్ర పరిశోధనలకు సహాయపడటమే కాకుండా - తనలోని కృత్రిమ మేధస్సును(ఏఐ) నూతన ఆవిష్కరణల్లో భాగస్వామిని చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

దీంతో మానవ ఆరోగ్యం - హైఎనర్జీ ఫిజిక్స్ - మెటీరియల్స్ డిస్కవరీ తదితర రంగాల్లో ఆవిష్కరణల వేగం పెరుగుతుందన్నారు. సూపర్ కంప్యూటర్ల విశ్లేషణ సామర్థ్యాన్ని సమిట్ మరో దశకు తీసుకెళ్లింది. విశ్లేషణ శక్తి - సమాచార నిల్వ - ప్రాసెసింగ్ వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుంది. తద్వారా పరిశోధకులు మరింత కచ్చితమైన ఫలితాలను మరింత వేగంగా పొందగలుగుతారు అని ఓఆర్ ఎన్ ఎల్ అసోసియేట్ డైరెక్టర్ జెఫ్ నికోల్స్ తెలిపారు. సమిట్‌ లోని కృత్రిమ మేధస్సుతో తక్కువ కాలంలో - వివిధ కోణాల్లో విశ్లేషించవచ్చని ఆయ‌న వివ‌రించారు.