Begin typing your search above and press return to search.

ప్ర‌పంచ‌బ్యాంకు సాక్షిగా బాబుకు షాక్ త‌గిలిన‌ట్లేనా

By:  Tupaki Desk   |   13 Sep 2017 5:23 PM GMT
ప్ర‌పంచ‌బ్యాంకు సాక్షిగా బాబుకు షాక్ త‌గిలిన‌ట్లేనా
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత ప్రీతిపాత్ర‌మైన న‌వ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం విష‌యంలో ఆయ‌న‌కు ఝ‌ల‌క్ త‌గిలింది. ఇప్ప‌టికే భూ సేక‌ర‌ణ‌కు స‌హ‌క‌రించ‌ని ప‌లు గ్రామాల రైతులు ఒక‌వైపు, నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌ లో కేసు మ‌రోవైపు ఉండ‌గా తాజాగా ప్ర‌పంచ‌బ్యాంకు సాక్షిగా అమ‌రావ‌తి ప్రాంత రైతులు షాకిచ్చారు. గతంలో భూ సమీకరణ విధానానికి వ్యతిరేకంగా ప్రపపంచ బ్యాంకుకు రైతులు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిశీలన నిమిత్తం వచ్చిన అధికారులతో రైతులు వారి సమస్యలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ విధానం తమకు సమ్మతం కాదని పెనమాక, ఉండవల్లి గ్రామాల రైతులు వెల్లడించారు.

ఈ రోజు పెనమాక, ఉండవల్లి గ్రామాల్లో ప్రపంచ బ్యాంక్‌ పరిశీలక బృందం పర్యటించింది. మూడు పంటలు పండే పొలాలను ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని, భూ సమీకరణ ఇవ్వలేదని మా పొలాలకు రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు కేవలం కాగితాల మీదనే ప్లాట్ల కేటాయింపులు జరిపారన్నారు. రాజధాని కోసం 53 వేల ఎకరాల భూమి అవసరం లేదని పెనమాక, ఉండవల్లి గ్రామాల రైతులు ప్రపంచ బ్యాంక్‌ అధికారులకు తెలిపారు. రైతుల అభిప్రాయాల‌ను తాము ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్లు అధికారులు తెలిపారు.

రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎకరాలకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. దీంతో 904 మంది భూ యజమానులు ప్రభావితులు అవుతారని ఆ నోటిఫికేషన్‌ లో పేర్కొంది. భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులు హైకోర్టును గ‌త ఏడాది ఆశ్రయించారు. పెనుమాకలో మూడు పంటలు పండే భూములు ఎలా తీసుకుంటారంటూ రైతులంతా కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం రైతుల దగ్గర నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే స‌మ‌యంలో ప‌లువురు రైతులు ప్ర‌పంచ‌బ్యాంక్‌ను ఆశ్ర‌యించారు.