Begin typing your search above and press return to search.

వరల్డ్ బ్యాంకు రుణం రద్దుకు కేంద్రమే కారణమట!

By:  Tupaki Desk   |   19 July 2019 3:49 PM GMT
వరల్డ్ బ్యాంకు రుణం రద్దుకు కేంద్రమే కారణమట!
X
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి తనవంతుగా రూ.2 వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రపంచ బ్యాంకు... ఉన్నట్టుండి, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే... ఆ రుణాన్ని రద్దు చేస్తున్నట్లు నిన్న చేసిన ఓ ప్రకటన పెను సంచలనమే రేపింది. రుణాన్ని రద్దు చేసిన వరల్డ్ బ్యాంకు... అందుకు గల కారణాలను మాత్రం వివరించలేదు. దీంతో జగన్ సీఎం అయ్యారు కదా... జగన్ ను చూసి భయపడిన నేపథ్యంలోనే వరల్డ్ బ్యాంకు తన రుణాన్ని రద్దు చేసుకుందని విపక్ష టీడీపీ నానా యాగీ చేస్తోంది. అదే సమయంలో చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం కోసం జరిగిన భూసేకరణలో దౌర్జన్యాలు - నిధుల దుర్వినియోగం - భూములను ఇష్టారాజ్యంగా కేటాయించిన తీరును చూసిన తర్వాతే వరల్డ్ బ్యాంక్ వెనక్కు తగ్గిందని అధికార వైసీపీ కూడా తనదైన శైలి వాదనను వినిపించింది. అయితే ఈ రెండు వాదనల్లో ఏ ఒక్కటి కూడా వరల్డ్ బ్యాంకు వెనక్కు వెళ్లడానికి కారణం కాదట. అయితే గియితే చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న పరిణామాలే వరల్డ్ బ్యాంకు రుణం రద్దుకు కారణంగా నిలుస్తాయి తప్పించి... జగన్ సర్కారుకు ఇందులో ఇసుమంతైనా పాత్ర లేదని ఇప్పుడు తేలిపోయింది.

అయినా వరల్డ్ బ్యాంకు రుణం రద్దుకు అసలు కారణం ఎవరన్న విషయానికి వస్తే... కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారేనట. అమరావతికి రుణం ఇచ్చే విషయంపై వరల్డ్ బ్యాంకుకు చేసిన వినతిని కేంద్రం తాజాగా ఉపసంహరించుకుందట. దీంతో వరల్డ్ బ్యాంకు కూడా అమరావతికి ఇవ్వనున్న రుణాన్ని రద్దు చేసుకుందట. అంటే ఈ రుణం రద్దు కావడానికి కేంద్రమే కారణం తప్పించి... ఇటు జగన్ గానీ - అటు చంద్రబాబు గానీ కారణం కాదు. మరి అసలు విషయాన్ని మరిచి జగనొచ్చాడు... అమరావతికి వరల్డ్ బ్యాంకు రుణం రద్దైంది అని టీడీపీ రచ్చ చేయడమెందుకన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక కేంద్రం ఈ మేరకు వరల్డ్ బ్యాంకుకు చేసిన వినతిని ఉపసంహరించుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.

అమరావతికి రూ.2 వేల కోట్ల రుణానికి వరల్డ్ బ్యాంకు సిద్ధం కాగానే... అసలు చంద్రబాబు సర్కారు తమ భూములను బలవంతంగా లాక్కుందని రైతులు - రైతులు ఇచ్చిన భూములను చంద్రబాబు సర్కారు తన అనుయాయులకు ఇష్టారాజ్యంగా పంచిపెడుతోందని ప్రజా సంఘాలు వరల్డ్ బ్యాంకుకు ఫిర్యాదు చేశాయి. ప్రజోపయోగం పేరిట రుణాన్ని తీసుకుంటున్న చంద్రబాబు సర్కారు.. ఆ రుణాన్ని తన స్వప్రయోజనాల కోసం వాడుకునే అవకాశాలున్నాయని, రుణాన్ని రద్దు చేయాలని వారు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులతో రంగంలోకి దిగిన వరల్డ్ బ్యాంకు ఓ ప్రతినిధి బృందాన్ని అమరావతికి పంపి వాస్తవ పరిస్థితిని తెలుసుకునే యత్నం చేసింది. ఈ క్రమంలో సదరు బృందం ఈ పరిశీలనను మరింత లోతుగానే చేయాల్సి ఉందని బ్యాంకుకు సూచించింది.

అదే సమయంలో ఎన్నికలు రావడం, ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులపై తమకు నివేదిక పంపాలని వరల్డ్ బ్యాంకు కోరగా... ఇప్పుడిప్పుడే అధికారం చేపట్టాం కదా... కాస్తంత వేచి ఉండాలని జగన్ సర్కారు కోరడం జరిగింది. ఈ క్రమంలోనే జోక్యం చేసుకున్న మోదీ సర్కారు... అమరావతికి ఇచ్చే రుణానికి సంబందించి వరల్డ్ బ్యాంకుకు చేసిన వినతిని ఉపసంహరించుకుంది. దీంతో వరల్డ్ బ్యాంకు కూడా అమరావతికి రుణాన్ని రద్దు చేసింది. అయినా కేంద్రం తన వినతిని ఉపసంహరించుకోవడంలోనూ ఓ లాజిక్ ఉంది. అదేమంటే... అమరావతిలో ఆశించిన మేర అభివృద్ది లేకపోగా - జరిగిన అభివృద్ధిలోనూ భారీ అవినీతి ఉందని, దీనిపై వరల్డ్ బ్యాంకు లోతుగా దర్యాప్తు చేస్తే... అమరావతిక ిరుణం మాట అటుంచి దేశంలోని చాలా రాష్ట్రాలకు వరల్డ్ బ్యాంకు మంజూరు చేసిన, మంజూరు చేయాల్సిన రుణాలకు ఇబ్బందేనన్న భావనతోనే అమరావతి రుణంపై తాను చేసిన వినతిని మోదీ సర్కారు ఉపసంహరించుకుందట.

ఈ లెక్కన.... బాబు హయాంలో ఆశించిన మేర అభివృద్ధి లేకపోవడం - జరిగిన పనుల్లోనూ భారీ అవినీతి చోటుచేసుకోవడాలే ఈ రుణం రద్దుకు దారి తీసిందని చెప్పక తప్పదు. ఇందులో జగన్ ను చూసి భయపడి వరల్డ్ బ్యాంకు రుణాన్ని రద్దు చేసిన మాట అన్నదే ఉత్పన్నం కాదు కదా. అమరావతి రుణం రద్దు వెనుక ఉన్న అసలు కారణం ఇది అయితే.... జగన్ ను బూచిగా చూపుతూ టీడీపీ చేస్తున్న స్వైర విహారంలో వీసమెత్తు నిజం కూడా లేదని తాజాగా తేలిపోయిందన్న మాట.