Begin typing your search above and press return to search.

మైసూర్ పాక్ లో 'పాక్' ఉంది

By:  Tupaki Desk   |   22 Oct 2016 7:04 AM GMT
మైసూర్ పాక్ లో పాక్ ఉంది
X
ఉరీ ఉగ్రవాద దాడులు - సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం అటు పాకిస్థాన్, ఇటు భారత్ లలో మిగిలిన విషయాలకంటే స్వచ్చంధ నిషేధాల మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సినిమాలు - నటీనటులు - ఆహార పదార్ధాలు - రేడియో - టీవీ ప్రసారాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే నిషేధాలకు గురయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ లో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేయగా - పాకిస్థాన్ కళాకారులను - వారికి మద్దతిస్తోన్న చైనా దేశపు ఉత్పత్తులను బహిష్కరించాలని భారత్‌ లో డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెల్సిందే. అయితే వీటిపై ఉన్న సీరియస్ నెస్ సంగతి కాసేపు పక్కనపెడితే ఈ నిషేధాలపై సామాజిక వెబ్ సైట్ లలో సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

"మైసూర్‌ పాక్‌"ను "మైసూర్‌ ఇండియా / మైసూర్ భారత్" అని పేరు మార్చేవరకు తినకండి, దాన్ని భారతీయులంతా బహిష్కరించండి! ఇదే క్రమంలో హైదరాబాద్‌ లోని "కరాచీ" బేకరీని - "కరాచీ" బిస్కట్లను - "కరాచీ" హల్వా - "లాహోరీ" నమక్ - "ముల్తానీ" మిట్టీ - "పెషావరీ" బిర్యానీ - "సింధీ" కఢీ లను అంతా బహిష్కరించండి... భారత్ - పాకిస్థాన్ ల మధ్య సాంస్కృతిక - వాణిజ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సరదా కామెంట్లు ఇవీ.

కాగా, మైసూర్‌ పాక్‌ లో "పాక్" అంటే పాకిస్థాన్ కాదని చాలా మందికి తెలిసిన విషయమే. నాలుగో కృష్ణరాజ్‌ వడయార్‌ తన మైసూర్‌ ప్యాలెస్‌ లో మొట్టమొదటి సారిగా ఈ స్వీట్‌ ను తయారు చేయడం వల్లన దీనికి మైసూర్‌ నగరం పేరుతో మైసూర్‌ పాక్‌ అని పేరు వచ్చింది. ఇక్కడ పాక్‌... అంటే కన్నడ భాషలో తీపి మిశ్రమం లేదా పాకం అని అర్థం. ఇదే సమయంలో కరాచీ "కరాచీ" బేకరీ కి పాకిస్థాన్ లోని ఒక ప్రాంతం పేరెందుకొచ్చిందంటే... సింధు నుంచి హైదరాబాద్‌ కు వలసవచ్చిన ఖాన్‌ చంద్‌ రమ్నాని అనేవ్యక్తి హైదరాబాద్‌లో ఈ బేకరీని ఏర్పాటు చేశారు. అతడు ఎక్కడినుంచైతే వలసవచ్చాడొ ఆ సింధు రాజధాని.. కరాచీ పేరును ఆ బేకరీకి, బిస్కట్లకు పెట్టుకున్నారు.

ఆ వివరాలు పూర్తిగా తెలిసో, తెలియకో కానీ... మైసూర్ పాక్ నుంచి కరాచీ బిస్కెట్ల వరకూ ఆ పేర్లన్నీ నిషేధించాలని సరదా కామెంట్స్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/