Begin typing your search above and press return to search.

తొలిసారి ఎన్నికల బరిలో సౌదీలో మహిళలు

By:  Tupaki Desk   |   30 Nov 2015 9:41 AM GMT
తొలిసారి ఎన్నికల బరిలో సౌదీలో మహిళలు
X
సౌదీ అరేబియా గురించి చాలామంది చాలా చెబుతుంటారు కానీ.. ఆ దేశంలో సామాజిక జీవనం గురించి వివరాలు తెలుసుకుంటే షాకింగ్ గా ఉంటాయి. డిజిటల్ యుగంలోనూ ఆ దేశంలోని మహిళలకు ఓటుహక్కు లేకపోవటం నమ్మలేని నిజం. ఈ మధ్యనే మహిళలకు ఓటుహక్కు కల్పించాలన్న డిమాండ్ తో కంటితుడుపు చర్యగా కొంతమందికి నామమాత్రంగా ఓటుహక్కు కల్పించారు. ఓటే లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదు. అయితే.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. ఆ దేశంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఈసారి మహిళలు ఎన్నికల బరిలోకి వచ్చేశారు.

దాదాపుగా 900 మంది మహిళలు ఎన్నికల బరిలోకి నిలవటం ఆసక్తికరంగా సాగింది. డిసెంబరు 12న సౌదీలోని మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో తొలిసారి మహిళలు బరిలోకి దిగుతున్నారు. సౌదీలో మున్సిపల్ ఎన్నికలు తొలిసారి 2005లో జరిగితే.. ఆ తర్వాత 2015లో జరిగాయి. ముచ్చటగా మూడోసారి డిసెంబరులో జరగనున్నాయి. మొత్తం 284 మున్సిపల్ స్థానాలకు 7వేల మంది పోటీ చేస్తుంటే.. వీరిలో మహిళలు 900 మంది. అయితే.. పురుషులతో పోలిస్తే.. మహిళలకు ఓట్లు పెద్దగా లేవు. దేశంలో జనాభా 2.1కోట్లమంది ఉంటే.. వారిలో 1.31లక్షల మంది మహిళలకు మాత్రమే ఓటుహక్కు ఉంది. అదే పురుషులకు 13.5లక్షల మందికి ఓటుహక్కు ఉండటం గమనార్హం. అయితే.. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన మహిళా అభ్యర్థులకు తాము ఓటు వేస్తామని.. వారు ఎవరో తెలీకున్నా ఫర్లేదని మహిళా ఓటర్లు చెబుతున్నారు. అయితే.. మహిళలకు ఉన్న ఓట్లతో మహిళా అభ్యర్థుల గెలుపు కష్టమేనన్న మాట వినిపిస్తోంది.