భర్త శవాన్ని బీఎండబ్ల్యూ కారులో పెట్టి..

Mon Mar 20 2017 18:37:24 GMT+0530 (IST)

 భర్తను చంపే భార్య.. భార్యను చంపే భర్త.. తండ్రిని  చంపే కొడుకు.. పిల్లల్ని చంపేసే తల్లిదండ్రులు.. ఇలా ఒకటేమిటి.. మానవ సంబంధాలకు అర్థం మారిపోయేలా దారుణ నేరాలు చోటుచేసుకుంటున్నాయి. పేద  ధనిక తేడా లేకుండా అన్ని వర్గాల్లో ఇలాంటి అమానవీయ ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్ లో ఇలాంటిదే ఒక దారుణ నేరం వెలుగుచూసింది.
    
పంజాబ్ లోని మొహాలీలో విలాసవంతమైన ప్రాంతంలో పార్క్  చేసిన ఖరీదైన బీఎండబ్ల్యూ కారు వెనుక సీటులో ఉన్న సూట్ కేస్ అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కారు వద్దకు చేరుకొని చూడగా.. అందులో ఉన్న సూట్ కేసులో ఒక వ్యక్తి శవాన్ని గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తిని ఏకంసింగ్ గా గుర్తించారు.
    
షాకింగ్ విషయం ఏంటంటే... ఏకంసింగ్ ను చంపింది ఆయన భార్య  సీరత్ ధిల్లానే. ఆ విషయం అంగీకరిస్తూ ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయారు. తన భర్తను తానే చంపినట్లుగా నిర్భయంగా చెప్పిందామె. శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో తన లైసెన్సెడ్ గన్ తో కాల్చేశానని.. ఇందుకు తన సోదరుడు.. అతని స్నేహితుడు సాయం చేసినట్లుగా నిందితురాలు చెప్పటం గమనార్హం.

భర్తను చంపిన తర్వాత అతని మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి.. కాలువలో పడేద్దామని అనుకున్నామని.. కానీ అంతలోనే పోలీసులకు తెలిసి పోయిందని పేర్కొంది. భర్తను ఎందుకు చంపిందన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన సమాచారం బయటకు రాలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/