Begin typing your search above and press return to search.

గార్డెన్ సిటీలో మరీ అంత దారుణమా?

By:  Tupaki Desk   |   2 May 2016 4:22 PM GMT
గార్డెన్ సిటీలో మరీ అంత దారుణమా?
X
అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని తెలియజెప్పే ఉదంతమిది. పేరుకు గార్డెన్ సిటీనే అయినా.. మహా రద్దీగా ఉండే బెంగళూరు మహా నగరంలో అందరూ తిరిగే రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయటం.. ఆ అమ్మాయి కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా ఉండటం.. ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లిన ఆగంతకుడి నుంచి లక్కీగా బయట పడటం లాంటి విషయాల్ని వింటే ఒళ్లు గగుర్పాటుకు గురి కావటం ఖాయం. అందరూ తిరిగే రోడ్డు మీద ఉన్నా.. ఒళ్లు ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలో చెప్పే ఈ ఉదంతం చాలా ఆలస్యంగా బయటకు రావటం గమనార్హం.

షాకింగ్ గా మారిన ఈ ఉదంతం వివరాలు సీసీ ఫుటేజ్ కారణంగా బయటకు వచ్చినట్లుగా చెప్పాలి. మణిపూర్ కు చెందిన ఒక యువతి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటోంది. తాను నివాసం ఉంటున్న ఇంటి ముందు రాత్రివేళ పది గంటల సమయంలో ఫోన్ మాట్లాడుతూ ఉంది. అంతే.. వెనుక నుంచి వచ్చిన ఒక ఆగంతుకుడు ఆ అమ్మాయి వెనుక నుంచి వచ్చి బలంగా నడుం పట్టేసుకొని.. ఎత్తుకెళ్లటం సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఏప్రిల్ 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. కిడ్నాప్ కు గురైన యువతి సంగతేంటన్న విషయానికి వస్తే.. లక్కీగా ఆమె తప్పించుకుంది. ఆమెను కిడ్నాప్ చేసిన ఆగంతకుడు నిర్మాణంలో ఉన్న ఒక భవనంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచార యత్నం చేయబోయాడు. ఆ ఆగంతకుడ్ని బలంగా కొరికి.. తోసేసి పారిపోయి వచ్చినట్లుగా ఒక టీవీ ఛానల్ కు చెప్పుకొచ్చింది. ఈ సీసీ ఫుటేజ్ టీవీలో టెలికాస్ట్ చేయటంతో ఈ దారుణం బయటకు వచ్చింది. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే.. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఏమైనా.. తాజాగా సదరు ఛానల్ ప్రసారం చేసిన ఈ కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.