Begin typing your search above and press return to search.

ఆమె అడిగింది.. ప్రధాని మోడీ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   27 Feb 2017 4:53 AM GMT
ఆమె అడిగింది.. ప్రధాని మోడీ ఇచ్చేశారు
X
ఏదైనా అంశాన్ని దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లటం సాధ్యమేనా? అంటే చాలా చాలా కష్టమని చెప్పేవాళ్లు. అయితే.. అదంతా మోడీ ప్రధాని కాకముందే. ఆయన ప్రధాని కుర్చీలో కూర్చున్న తర్వాత.. ప్రజలకు చాలా దగ్గరగా రావటమే కాదు.. అనుక్షణం అప్ డేటెడ్ గా ఉండటం ఆయనకు మాత్రమే చెల్లుతుందని చెప్పాలి. సోషల్ మీడియాలో మహా చురుగ్గా ఉండే ఆయన.. మైలేజీ వచ్చే ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టరని చెప్పాలి. సముచితమైన కారణంతో ఏదైనా సాయాన్ని అర్థించినా.. లేఖ రూపంలోతమ సమస్యను చెప్పుకున్నా.. వెనువెంటనే స్పందించే గుణం మోడీలో ఎక్కువన్న భావన కలుగజేయటంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి.

సోషల్ మీడియా సాయంతో.. ప్రజలకు టచ్ లో ఉండే విషయంలో ప్రధాని మోడీతో పాటు.. ఆయన మంత్రివర్గంలోని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తదితరులు ఉంటారు. తమ శాఖల పరంగా ఏదైనా సమస్యల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మరుక్షణం వారు స్పందించటమే కాదు.. వారి సమస్యల్ని పరిష్కరించేలా చేసి దేశ ప్రజల మనసుల్ని దోచుకున్న ఉదంతాలెన్నో. తాజాగా తనదైన శైలిలో రియాక్ట్ అయిన ప్రధాని తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.

ప్రధాని ధరించిన ఒక స్కార్ఫ్ చాలా బాగుంది.. దాన్ని నాకు ఇస్తారా? అంటూ అడిగిన ఒక మహిళ విన్నపానికి మోడీ సానుకూలంగా స్పందించారు. ఆమె ట్వీట్ కు రియాక్ట్ కావటమే కాదు.. ఆమె కోరిన విధంగా స్కార్ఫ్ ఆమెకు పంపిన వైనం ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఆదియోగి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన బ్లూ కలర్ స్కార్ఫ్ ను మెడలో వేసుకున్నారు. ఈ స్కార్ఫ్ చాలా బాగుందని.. తనకు చాలా నచ్చేసిందని.. వెంటనే తనకు ఆ స్కార్ఫ్ కావాలంటూ ప్రధాని మోడీని ట్యాగ్ చేస్తూ శిల్పి తివారీ అనే మహిళ ట్వీట్ చేశారు. ఒకే ఒక్క లైన్ ఉన్న ఆ ట్వీట్ ఆయన్ను ఎంతలా ఇంప్రెస్ చేసిందో ఏమో కానీ.. వెంటనే.. ఆ ట్వీట్ ను ప్రింటవుట్ తీసి.. దాని మీద స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి.. ఆమె కోరిన విధంగా తాను వేసుకున్న బ్లూ కలర్ స్కార్ఫ్ ను పార్సిల్లో పంపేశారు.

ప్రధానిని కోరటం ఒక ఎత్తు.. దానికి ఆయన స్పందించటమే కాదు.. స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి పార్సిల్ పెట్టిన వైనంతో శిల్పి తివారీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వెంటనే.. మోడీపంపిన స్కార్ఫ్ ను మెడలో వేసుకున్న ఆమె.. మోడీ పంపిన ఆటోగ్రాఫ్ ప్రింట్ అవుట్ పట్టుకొనిఒక ఫోటో దిగి.. తన ప్రొఫైల్ పిక్ గా మార్చుకున్నారు. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో అభినందల వర్షం కురుస్తోంది. ప్రధాని స్పందించిన తీరును తాను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటానని శిల్పి తివారీ చెబుతున్నారు. నూట ముప్ఫై కోట్ల మందిలో ఒకరు.. తనను అభ్యర్థించిన వెంటనే స్పందించటం.. అది కూడా దేశ ప్రధాని స్థానంలో ఉన్న వారు కావటం చిన్న విషయమా ఏంటి..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/