Begin typing your search above and press return to search.

ఏపీ శీతాకాల సమావేశాలు అమరావతిలో

By:  Tupaki Desk   |   7 Oct 2015 4:19 AM GMT
ఏపీ శీతాకాల సమావేశాలు అమరావతిలో
X
తాను తలుచుకుంటే అద్భుతాలు ఆవిష్కరిస్తానన్న విషయాన్ని ప్రపంచానికి చాటాలని భావిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయదశమి రోజున ఏపీ రాజధాని శంకుస్థాపన నిర్వహించనున్న నేపథ్యంలో.. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్ని అమరావతిలోనే ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాజధాని నిర్మాణం అంటే దశాబ్దాల పాటు సాగే అనంతమైన ప్రయాణమన్న వాదనను కొట్టిపారేసేలా.. ఊహించనంత వేగంగా రాజధాని నిర్మాణం తాము చేపడుతున్న విషయాన్ని చాటి చెప్పాలన్నది ఏపీ సర్కారు ఆలోచనగా ఉంది.

శీతాకాల అసెంబ్లీ సమావేశాల్ని తూళ్లురులో భూమిపూజ జరిగే ప్రాంతంలోనే అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించాలన్న ఆలోచనను ఆవిష్కరిస్తున్నారు. అదే జరిగితే భావోద్వేగంతో పాటు.. హైదరాబాద్ మీద ఎక్కువ కాలం ఆధారపడాల్సిన అవసరం లేదన్న సంకేతాన్ని ఇవ్వటంతో పాటు.. హైదరాబాద్ నుంచి వీలైనంత త్వరగా ఏపీ పరిపాలనను తీసుకెళ్లిపోవాలన్న ప్రభుత్వ కృత నిశ్చయం చాటి చెప్పినట్లు అవుతుందని భావిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తుళ్లూరులో చేపట్టటం ద్వారా.. రాజధాని నిర్మాణంలో తొలి దశను సార్వత్రిక ఎన్నికల ముందు నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని అందుకోవటానికి తాము విపరీతంగా కష్టపడుతున్న విషయాన్ని చాటి చెప్పాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణను ఏదైనా కన్సల్టెన్సీకి అప్పగించటంతో పాటు.. ప్రజాప్రతినిధుల బసను హాయ్ ల్యాండ్.. విజయవాడ.. గుంటూరు ప్రాంతాల్లోని అతిధి గృహాల్లో ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. మొత్తంగా శీతాకాల సమావేశాన్ని ఏపీ రాజధానిలో శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే చేపట్టటం ద్వారా రాజధాని నిర్మాణంలో తమ వేగాన్ని చాటిచెప్పటంతో పాటు.. హైదరాబాద్ అవసరం తమకు లేదన్న విషయాన్ని స్పష్టం చేయనున్నట్లుగా తెలుస్తోంది.