Begin typing your search above and press return to search.

షరీఫ్ అలా చెబితే... హఫీజ్ ఇలా చెప్పాడు

By:  Tupaki Desk   |   1 Oct 2016 5:54 AM GMT
షరీఫ్ అలా చెబితే... హఫీజ్ ఇలా చెప్పాడు
X
భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ షాక్ నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. జరిగిన దానికి నష్టనివారణ చ‌ర్య‌లు చేపట్టిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. ఇస్లామాబాద్‌లో అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ దూకుడుగా వ్యవహరిస్తే.. తిప్పి కొట్టే సత్తా తమకు ఉందన్నమాటను చెబుతూ.. పాక్ శాంతికాముక దేశమని.. శాంతిని కోరుకుంటుందని చెప్పుకొచ్చారు. నియంత్రణ రేఖ వద్ద భారత్ దూకుడు చర్యలకు దిగితే.. తమ ప్రజల్ని కాపాడుకునేందుకు పాక్ ఎంతకైనా తెగిస్తుందన్న మాటను చెప్పిన షరీఫ్.. సర్జికల్ స్ట్రైక్స్‌ జరగనే జరగలేదని చెప్పుకొచ్చారు.

షరీఫ్ అలా చెబుతుంటే.. హర్కతుల్ జిహాదీ ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ మాటలు మరోలా ఉన్నాయి. అసలైన సర్జికల్ దాడులు ఎలా ఉంటాయో తాము చూపిస్తామన్న మాటను అత‌డు చెబుతున్నాడు. 2008 ముంబై దాడుల సూత్రధారి అయిన సయీద్.. తాజాగా ఫైజలాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మోడీకి సర్జికల్ దాడులేంటన్నది చూపిస్తామని.. పాక్ జవాన్లు సర్జికల్ దాడులు చేస్తే ఎలా ఉంటుందో భారత మీడియాకు చూపిస్తామని నోరు పారేసుకున్నాడు.

‘‘పాక్ జవాన్లు చేపట్టే సర్జికల్ దాడులు చూపిస్తాం. అప్పుడు అమెరికా కూడా మిమ్మల్ని కాపాడలేదు’’ అన్న వార్నింగ్ స‌యీద్ నోటి నుంచి వచ్చింది. ‘భారత దాడి పూర్తి అయ్యింది. దీనికి సరైన సమాధానం ఇచ్చేందుకు పాకిస్థాన్ కు అవకాశం వచ్చింది’’ అని చెప్పటం ద్వారా పాక్ ప్రధాని మాటల్లో నిజం లేదని తేల్చటమేకాదు.. తన గడ్డ మీద జరిగిన లక్షిత దాడుల్ని పాక్ ఎంతగా కవర్ చేసుకుంటుందన్న విషయాన్ని చెప్పేశాడు. సర్జికల్ దాడులు అస్సలు జరగనే జరగలేదంటున్న పాక్ ప్రధానికి.. అందుకు భిన్నంగా మాట్లాడుతున్న ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయిద్ మాటలకు మధ్య పోలికంటూ ఏమీ లేదన్న విషయం తాజా పరిణామాలతో స్పష్టమైందని చెప్పక తప్పదు.