Begin typing your search above and press return to search.

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించేస్తారా?

By:  Tupaki Desk   |   19 July 2019 12:37 PM GMT
కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించేస్తారా?
X
కర్ణాటక రాజకీయంలో స్పీకర్ కు ఉన్న విశేష అధికారాల ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్పీకర్ రమేశ్ కుమార్ కుమారస్వామి సర్కారుకు వీలైనంత పుషప్ ఇస్తున్నారు.

ఎమ్మెల్యేలు రాజీనామాలను తక్షణం ఆమోదించకుండా సంకీర్ణ సర్కారును చాలా వరకూ కాపాడుకున్నారు రమేశ్. అదే సమయంలో ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడం, ఆమోదించకపోవడం స్పీకర్ కు ఉన్న అధికారమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలా ఆ వ్యవహారం సంకీర్ణానికి కలిసి వచ్చింది.

ఇక ఇప్పట్లో ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించే అవకాశాలే కనిపించడం లేదు. అయితే వేరే రకంగా కూడా సంకీర్ణ సర్కారుకు ముప్పు పొంచింది. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగితే కుమారస్వామి సర్కారు పడిపోవడం ఖాయమనే అంచనాలున్నాయి.

అయితే ఆ ఓటింగ్ జరగడం లేదు. దానికి అనేక రీజన్లను చెబుతున్నారు సంకీర్ణ సర్కారు పెద్దలు. విశ్వాస పరీక్ష పై పూర్తి చర్చ జరగకుండా ఎలా ఓటింగ్ జరపాలని వారు ప్రశ్నించేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ వాళ్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

కుమారస్వామికి, కాంగ్రెస్ వాళ్లకు మరి కాస్త సమయం దొరికితే అసంతృప్త ఎమ్మెల్యేల దారి ఎటు మళ్లుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా కర్ణాటకలో ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలనను విధించే ఆలోచనలో ఉందట కేంద్రంలోని సర్కారు. అదే జరిగితే కొన్ని విమర్శలు తప్పకపోవచ్చు. అలాగే తక్షణం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉండవు. దీంతో ఈ వ్యవహారంలో కమలనాథులు కాస్త ఆచితూచి స్పందించే అవకాశాలున్నాయి.