Begin typing your search above and press return to search.

హెచ్-4 వీసాల రద్దు ప్ర‌క్రియ వేగ‌వంతం?

By:  Tupaki Desk   |   22 Sep 2018 10:41 AM GMT
హెచ్-4 వీసాల రద్దు ప్ర‌క్రియ వేగ‌వంతం?
X
అమెరికాలో ప‌నిచేస్తోన్న హెచ్‌1-బి వీసాదారుల భాగస్వాములు.....హెచ్‌-4వీసాపై అమెరికా వ‌చ్చే వీలుంది. అలా హెచ్-4 డిపెండెంట్‌ వీసాపై వచ్చే వారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు 2012లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అనుమతించారు. దీంతో, భార‌తీయులు చాలామంది అమెరికా బాట ప‌ట్టారు. కానీ, 2014లో అధికారం చేప‌ట్టిన ట్రంప్....అమెరికాలో ఉద్యోగాలు అమెరిక‌న్ల‌కే అనే లోకల్ సెంటిమెంట్ ను రెచ్చ‌గొట్టారు. హెచ్‌-4 వీసాపై వచ్చే భాగస్వాములు ఉద్యోగాలు చేసేందుకు వీలు లేకుండా కొత్త నిబంధ‌న‌లు విధించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈక్ర‌మంలోనే మ‌రో 3 నెలల్లో హెచ్-4 వీసాలను రద్దు చేయనున్నట్లు ఫెడరల్ కోర్టుకు ట్రంప్ స‌ర్కార్ తెలిపింది. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలోని కోర్టులో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ ఈ ప్ర‌కారం పిటిషన్ దాఖలు చేసింది. హెచ్-4 వీసాలను రద్దు చేసేందుకు విధివిధానాలు రూపొందించామ‌ని - ఈ ప్ర‌క్రియ ప్రారంభమైందని - తెలిపారు. మ‌రో 3 నెలల్లో ఇది పూర్త‌వుతుందని కోర్టుకు హెచ్ డీఎస్ వెల్లడించింది.

హెచ్ -4 వీసాల ర‌ద్దుకు సంబంధించి కొత్త నిబంధనలను వైట్ హౌజ్‌ లోని బడ్జెట్ నిర్వహణ కార్యాలయానికి మరో 3నెలల్లో అందిస్తామని హెచ్ డీఎస్ స్పష్టం చేసింది. హెచ్-4 వీసాలను రద్దు చేయాలంటూ సేవ్ జాబ్స్ యూఎస్ ఏ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్ర‌కారం నిబంధ‌న‌లు రూపొందించామ‌ని కోర్టుకు హెచ్ డీఎస్ వివరణ ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచాలని కోరింది. హెచ్-4 వీసాల వ‌ల్ల లోక‌ల్ అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలు త‌గ్గిపోయాయ‌ని సేవ్ జాబ్స్ యూఎస్ ఏ సంస్థ ఆరోపించింది. ఇప్ప‌టివ‌ర‌కు 3 అవ‌కాశాలు ఇచ్చినా....ఆ వీసాల ర‌ద్దుకు ట్రంప్ సర్కార్ విధానాలను రూపొందించలేదని ఆరోపించింది. దానికి సంబంధించిన కార్య‌చరణ త్వ‌రగా రూపొందించాలని సేవ్ జాబ్స్ యూఎస్ ఏ సంస్థ పిటిషన్ లో పేర్కొంది. ఆ నిర్ణయాన్ని త్వ‌ర‌గా వెల్లడించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోర్టును కోరింది. యూఎస్ సిటిజెన్‌ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ హెచ్-4 వీసాదారులకు సంబంధించి డిసెంబర్ 25 - 2017లో 1,26,853 ఉద్యోగ అప్లికేషన్లకు ఆమోదం తెలిపింది. ఇందులో 93శాతం దరఖాస్తులు భారతీయులవే. చైనాకు చెందిన అప్లికేషన్లు 5శాతం - మిగతా ప్రపంచ దేశాలకు చెందిన వారివి 2శాతం మాత్రమే ఉండ‌డం విశేషం. మ‌రో మూడు నెలల్లో ఆ నిబంధ‌న‌లు రూపొందితే చాలామంది భార‌తీయులు ఇబ్బందిప‌డ‌తారు.