Begin typing your search above and press return to search.

బొండా ఉమా జంపేనా? మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు

By:  Tupaki Desk   |   19 July 2019 11:13 AM GMT
బొండా ఉమా జంపేనా?  మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు
X
ఏపీలో అధికారం కోల్పోయిన టీడీపీలో జ‌పింగుల ప‌ర్వం ఇంకా కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యు లు జంప్ చేస్తే.. ఇప్పుడు మాజీలు కూడా ఇదే బాట‌లో కొన‌సాగుతున్నారు. బెజ‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ఆయ‌న పార్టీ మార్పుపై ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. పార్టీలో అంత‌ర్గ‌త విభేదాల‌తోనే ఆయ‌న జంప్ చేస్తున్నార‌ని అంటున్నారు. 2014 ఎన్నిక‌ల్లో తొలిసారి ప్ర‌జాక్షేత్రంలో పోటీ చేసిన ఆయ‌న విజ‌య‌వాడ‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎవ‌రికీ రానంత భారీ మెజారిటీని ద‌క్కించుకున్నారు.

ఇక‌, త‌ర్వాత పార్టీలో ఫైర్ బ్రాండ్‌ గా ఎదిగారు. ప్ర‌తిప‌క్షం వైసీపీని ఇరుకున పెట్టారు. బ‌ల‌మైన గ‌ళాన్ని వినిపించి రాజ‌కీ యంగా సంచ‌ల‌నాలు సృష్టించారు. వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కూడా కేంద్రంగా మారిన ఉమా.. భూక‌బ్జాల విష‌యంలో ప్ర‌ధానంగా వార్త‌ల్లో నిలిచారు.ఇక‌, ప్ర‌భుత్వ ప‌రంగా చూసుకుంటే.. 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ‌లో ఆయ‌న మంత్రి ప‌ద‌విని ఆశించారు. అయితే, అప్ప‌ట్లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో కినుక వ‌హించారు. అయితే, చంద్ర‌బాబు ఆయ‌న‌కు అడ‌గ‌కుండానే టీటీడీ బోర్డులో స‌భ్యుడిగా ప‌ద‌విని అప్ప‌గించారు. దీంతో కొంత ఉప‌శ‌మ‌నం పొందారు. ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తిరిగి పోటీ చేసినా.. అత్యంత స్వ‌ల్ప ఓట్ల తేడాతో అంటే 25 ఓట్ల తేడాతో మాత్ర‌మే ఓట‌మి పాల‌య్యారు.

దీంతో బాగా హ‌ర్ట్ అయిన బొండా ఉమా.. నియోజ‌క‌వ‌ర్గానికి, పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఇక‌, పార్టీలో ఉండి కూడా ప్ర‌యోజ‌నం లేద‌ని బావించిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల కాకినాడ‌లో జ‌రిగిన కాపు నాయ‌కుల స‌మావేశానికి హాజ‌రైన ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాపుల విష‌యంలో చంద్ర‌బాబు వైఖ‌రి తెల‌సుకున్నాక త‌మ వైఖ‌రి చెబుతామంటూ వ్యా ఖ్యానించారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న ఏకంగా పార్టీకి గుడ్ బై చెబుతార‌ని అంటున్నారు. టీడీపీలో ఉన్నా.. ఇప్పుడు త‌న‌కు ఒరిగేది ఏమీ లేద‌ని బొండా భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టీడీపీ క‌న్నా త‌న‌కు మెరుగైన పార్టీ వైసీపీ అని బావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి కుదిరితే.. దీనిలోకి లేదా బీజేపీలోకి జంప్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా టీడీపీకి కీల‌క నాయ‌కుడు దెబ్బ కొడుతున్న మాట వాస్త‌వం.