Begin typing your search above and press return to search.

జంక్ ఫుడ్ మీద మ‌క్కువ గుట్టు వీడింది!

By:  Tupaki Desk   |   19 Jun 2018 1:30 AM GMT
జంక్ ఫుడ్ మీద మ‌క్కువ గుట్టు వీడింది!
X
తిన్నంత‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాలనిపించేలా ఉంట‌యి జంక్ ఫుడ్స్. తింటే ఆరోగ్యానికి చేట‌న్న విష‌యం తెలిసి కూడా.. వాటి మీద మోజు చంపుకోలేని వారు కోట్ల‌ల్లోనే ఉంటారు. అప్ప‌టివ‌ర‌కూ తిన‌కూడ‌ద‌ని బ‌లంగా అనుకున్నా.. జంక్ ఫుడ్ చూసినంత‌నే వాటి మీద మ‌న‌సు పారేసుకోవ‌టం.. ఈ ఒక్క‌సారికి సర్దుకుపోదాంలే.. రేప‌ట్నించి క‌చ్ఛితంగా తిన‌కుండా ఉందామ‌నిపించి.. అప్ప‌టికైతే పొట్ట‌లో వేసుకునేలా చేసే ఆక‌ర్ష జంక్ ఫుడ్ కు కూసింత ఎక్కువే.

ఆరోగ్యంపై దుష్ఫ్ర‌భావం చూపించే జంక్ ఫుడ్ మీద మ‌నిషికి ఎందుకింత మ‌మ‌కారం? ఎందుకు దాని మ‌త్తు నుంచి బ‌య‌ట ప‌డ‌లేకపోతున్నాడు? అన్న‌ప్ర‌శ్న‌కు స‌మాధానాలు వెతికే ప్ర‌య‌త్నం చేశారు కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు. ఇందుకోసం వారు జ‌రిపిన అధ్య‌య‌నంలో కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

జ‌ర్మ‌నీకి చెందిన మ్యాక్స్ ఫ్లాంక్ సంస్థకు చెందిన రీసెర్చ్ విభాగ శాస్త్ర‌వేత్త‌లు జంక్ ఫుడ్ మీద ఇష్టాన్ని ఎందుకు వ‌ద‌ల్లేక‌పోతున్నాడ‌న్న అంశంపై లోతుగా అధ్య‌య‌నం చేశారు. దీనికి మూలాలు త‌ల్లిపాల నుంచే ఉంటాయ‌న్న కొత్త విష‌యాన్ని గుర్తించారు. అప్పుడే పుట్టిన బిడ్డ‌.. త‌ల్లిపాలే ఆధారం. భూమి మీద ప‌డిన త‌ర్వాత మొద‌ట‌గా రుచి చూసేది త‌ల్లిపాల‌నే. ఇందులో కార్బొహైడేట్లు.. కొవ్వు ప‌దార్థాలు అధిక‌స్థాయిలో ఉంటాయి. వీటితోనే మొద‌ల‌య్యే జీవితం.. ఇదే మోతాదులో ఉండే బంగాళ‌దుంప‌లు.. తృణ‌ధాన్యాల్లోనూ ఉంటాయి. దీంతో.. జంక్ ఫుడ్.. కార్బొహైడ్రేడ్ల‌పై మ‌క్కువ‌ను ఎంత‌కు త‌గ్గించుకోలేక‌పోతున్నట్లుగా చెబుతున‌నారు.

స‌హ‌జంగా త‌ల్లిపాల‌లో ఉండే కార్బొహైడేట్లు.. కొవ్వు ప‌దార్థాల మాదిరే ఫ్రెంచ్ ఫ్రైస్.. కేండీ బార్ లాంటి వాటిల్లోనే ఉంటాయి. త‌ల్లిపాల‌పై మ‌నం పెంచుకున్న ఆస‌క్తే.. త‌ర్వాతి రోజుల్లో జంక్ మీద మ‌క్కువ పెంచుకునేలా చేస్తాయ‌న్న భావాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. త‌ల్లిపాల ప‌రిచ‌యంతో మెద‌డులోని వ్య‌వ‌స్థ‌ల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని..ఈ కార‌ణంతోనే జంక్ ఫుడ్ ను అంత తేలిగ్గా వ‌ద‌ల్లేని ప‌రిస్థితి ఉంటుంద‌ని చెబుతున్నారు.

తాము గుర్తించిన అంశాన్ని ప్రాక్టిక‌ల్ గా కొంత‌మందిపై ప్ర‌యోగించి.. అధ్య‌య‌నం చేశారు. కంప్యూట‌ర్ గేమ్స్ ఎక్కువ‌గా ఆడే కొంత‌మంది వాలంటీర్ల‌పై ప్ర‌యోగించారు. అత్య‌ధిక కార్బొహైడ్రేట్లు.. కొవ్వుతో కూడిన ఫుడ్ ను ఇచ్చారు. ఇవి తిన్న త‌ర్వాత కంప్యూట‌ర్ గేమ్స్ ను ఆడేట‌ప్పుడు మిగిలిన వారితో పోలిస్తే.. ఈ ఫుడ్ తిన్న వారి మెద‌డు చురుగ్గా ప‌ని చేయ‌టాన్ని గుర్తించారు. ఇదే.. జంక్ ఫుడ్ ను మాన‌లేక‌పోవ‌టానికి కార‌ణమ‌ని క‌నుగొన్నారు. అయితే.. జంక్ ఫుడ్ మెద‌డులోని వ్య‌వ‌స్థ‌ల్ని తీవ్రంగా ప్ర‌భావితం చేస్తాయి. ఈ అధ్య‌య‌న నివేదిక చెప్పిన దానిబ‌ట్టి చూస్తే.. జంక్ ఫుడ్ ను మాన‌టం అంత తేలికైన విష‌యం కాదు. కానీ.. ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నిస్తే సాధ్యం కానిదేమీ ఉండ‌ద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.