Begin typing your search above and press return to search.

మధురైలోనే కమల్ ఎందుకు మొదలుపెట్టారంటే..

By:  Tupaki Desk   |   21 Feb 2018 1:55 PM GMT
మధురైలోనే కమల్ ఎందుకు మొదలుపెట్టారంటే..
X
తమిళ నటుడు కమల్ హసన్ తన కొత్త పార్టీని ప్రారంభించేందుకు మధురైని ఎందుకు వేదికగా చేసుకున్నారు.. ఫిబ్రవరి 21ని పార్టీ ప్రకటనకు సరైన తేదీగా ఎందుకు ఎంచుకున్నారు..? తమిళనాట దీనిపై వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. తమిళులు తమ భాషకు, సంస్కృతికి, ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే మనుషులు.. అందుకే.. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 21ని ఆయన ఎంచుకున్నట్లుగా చెప్తున్నారు.

ఇక మధురైలో ఒత్తకడాయ్ మైదానంలో ఆయన ఈ ప్రకటన చేయడం వెనుక కూడా పలు కారణాలు చెబుతున్నారు. మధురైలోనే ఆయన పార్టీని అనౌన్స్ చేయడానికి కారణాలు ఉన్నాయంటున్నారు. 1921లో జాతిపిత మహాత్మా గాంధీ మధురైలోనే ఫార్మల్ దుస్తులు వదిలి దోవతి ధరించారని.. గాంధీజీ యాత్రలో ఇది చాలా కీలకమైనదని.. అందుకే కమల్ ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది.

అంతేకాదు, కమల్ హాసన్ స్వగ్రామం మధురై సమీపంలోని పరమకూడి. ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలుగా విడదీసే వరకు పరమకూడి మధురైలో భాగంగా ఉండేది. అంతేకాదు.. మధురైలో రాజకీయంగా పట్టు సాధిస్తేనే రాష్ట్రంపై పట్టు దొరుకుతుందని తమిళ పార్టీలు, నేతలు భావిస్తారు. అందకే కమల్ మధురై నుంచే మొదలుపెట్టారన్న మరో వాదనా వినిపిస్తోంది.

ఎంజీ రామచంద్రన్ ఎప్పుడు కూడా మధురై నుంచి లేదా దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోటీ చేశారు. నటుడు విజయకాంత్ కూడా 2005లో తన పార్టీని ఇక్కడి నుంచే ప్రారంభించారు. అంతేకాదు.. మధురైలో దేవర్‌ ల ప్రాబల్యం ఎక్కువ. కమల్ హాసన్ తీసిన పలు సినిమాలకు ఈ కమ్యూనిటీయే స్ఫూర్తి అని చెప్తారు. ఈ అన్ని కారణాల వల్ల కమల్ మధురైని ఎంచుకున్నారని చెప్తున్నారు.