Begin typing your search above and press return to search.

కేసీఆర్ అంత బుద్ధీ అయిపోయారేంది?

By:  Tupaki Desk   |   3 Sep 2015 5:39 PM GMT
కేసీఆర్ అంత బుద్ధీ అయిపోయారేంది?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మ‌ధ్యనున్న లొల్లి ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. రాజ‌కీయాల్లో స‌హ‌జంగా ఉండే ల‌క్ష్మ‌ణ‌రేఖ‌ల్ని సైతం దాటేసి..చంద్ర‌బాబుకు చెక్ చెప్పేసిన కేసీఆర్ ఉన్న‌ట్లుండి బుద్ధీగా మారిపోవ‌టం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. అవ‌కాశం చిక్కాలే కానీ న‌లిపేయాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. నిద్ర లేని రాత్రుల్ని రుచి చూపించిన స‌త్తా కేసీఆర్ సొంతం. త‌న పార్టీకి చెందిన నేత‌ల్ని ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రిని తీసికెళిపోతూ.. దెబ్బ మీద దెబ్బేస్తున్న కేసీఆర్‌కు.. ఊహించ‌ని షాక్ ఇవ్వాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ వేస్తే.. అస‌లుసిస‌లు రింగ్ మాష్ట‌ర్ మాదిరి వ్య‌వ‌హ‌రించి త‌మ్ముళ్ల‌కు చుక్క‌లు చూపించ‌ట‌మే కాదు.. ఒక‌నాటి గురువుకు ఒక‌నాటి విధేయ శిష్యుడు షాక్ ఇస్తే ఎలా ఉంటుందో చ‌రిత్ర‌లో న‌మోదు చేసేశారు కేసీఆర్‌.

ఎన్నిక‌ల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు మేర‌కు త‌న‌కు సొంతం కావాల్సిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా సాధించుకోవాల‌ని ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి అభిల‌షించ‌టం త‌ప్పేం కాదు. అదేమీ స్థాయికి మించిన కోరిక కూడా ఏమీ కాదు. త‌న‌తో ఉండాల్సిన వారు.. చేజారి త‌న ప్ర‌త్య‌ర్థి పంచ‌న చేర‌టాన్ని ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేత ఎంత‌మేర‌కు స‌హించ‌గ‌ల‌డు?

నిత్యం ఉప్పు కారం తింటూ.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి రాజ‌కీయం చేసి.. కేంద్రంలో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన వ్య‌క్తికి ఇగో ఉండ‌కుండా ఉంటుందా? అందులోకి ప‌దేళ్లు అధికారానికి దూరంగా ఉండి.. ఎట్ట‌కేల‌కు ప‌వ‌ర్‌ను చేతిలో పెట్టుకున్న అధినేత‌కు రివెంజ్ తీర్చుకోవాల‌నుకోవ‌టం అత్యాశేం కాదుగా.

అందుకేనేమో.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌నకు న్యాయంగా రావాల్సిన ఒక్క సీటుతో పాటు.. బోన‌స్‌గా మ‌రో సీటు సాధిస్తే.. ఎలా ఉంటుంద‌న్న ఫాంట‌సీతో పుట్టిన ఆలోచ‌న కొత్త ప్ర‌ణాళిక‌కు తెర తీసింద‌ని చెప్పొచ్చు. అయితే.. తాను ఆడుతున్న ఆట‌లో ప్ర‌త్య‌ర్థి స్థానంలో ఉన్న వ్య‌క్తి మామూలోడు కాద‌ని.. ఒక‌నాటి త‌న విధేయ శిష్యుడు కాద‌ని.. క‌ర‌డుగ‌ట్టిన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అన్న విష‌యంలో బాబు వేసుకున్న అంచ‌నాలో దొర్లిన త‌ప్పున‌కు ఫ‌లితంగా ఓటుకు నోటు వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింద‌ని చెప్పొచ్చు.

తాను కానీ ప్లాన్ వేస్తే.. ఎదుటోడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావ‌టం మాత్ర‌మే తెలిసిన చంద్ర‌బాబుకు.. అందుకు భిన్న‌మైన అనుభ‌వం కొత్తే. బాబు ఆలోచ‌న తీరు.. ఆయ‌న మైండ్‌సెట్ ఎలాంటిదో కేసీఆర్ లాంటి నేత‌కు తెలియంది కాదు. అందుకే.. ఆయ‌న ఎక్క‌డ త‌ప్పులు చేస్తారో.. క‌చ్ఛితంగా అక్క‌డే చెక్ చెప్ప‌టంతో పాటు.. ఊహించ‌ని పంచ్ ఇచ్చేందుకు.. రాజ‌కీయ నేత‌ల‌కు ఉండే స‌హ‌జ హ‌ద్దుల్ని సైతం దాటేసేందుకు కేసీఆర్ మొహ‌మాట ప‌డ‌లేదు.

ఇలాంటి ప‌రిణామాల‌తో ఓటుకు నోటు కేసు తెర‌పైకి వ‌చ్చింది. కేసీఆర్ ఎంత తెలివైన వ్య‌క్తో.. బాబు కూడా అంత తెలివైనవాడు కాద‌నుకోవ‌టం అమాయ‌క‌త్వ‌మే అవుతుంది. కాక‌పోతే.. ఉద్య‌మ జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న కేసీఆర్ కు.. రాజ‌కీయాల్లో ఎదురుదెబ్బ‌లు తిన్న చంద్ర‌బాబుకు మ‌ధ్య మైండ్ సెట్ లో కాస్త తేడా ఉంటుంది. ఉద్య‌మ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న వారికి దూకుడు ఎక్కువ ఉంటుంది. నియ‌మాలు..నిబంధ‌న‌లు.. గేమ్ రూల్స్ లాంటివి పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ.. రాజకీయాల్లో ఉన్న వారు అలా కాదు. ఎంత దిగ‌జారిపోయిన రాజ‌కీయాలైనా.. కొన్ని విష‌యాల్లో గీత దాటేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి కోవ‌కే చంద్ర‌బాబు.. కేసీఆర్ విసిరిన ఉచ్చులో అడ్డంగా దొరికిపోయారు. తాను ఆడుతున్న ఆట ఎలాంటి వ్య‌క్తితో అన్న విష‌యం అర్థం కావ‌టానికి చంద్ర‌బాబుకు కాస్త స‌మ‌యం ప‌ట్టినా.. దానికి ధీటుగా వ్యూహం సిద్ధం చేసేందుకు ఆయ‌న దాదాపు నాలుగైదు రోజులు బ‌య‌ట‌కు అడుగు పెట్ట‌కుండా వ‌రుస మంత‌నాల్లో మునిగిపోయారు. ఆ మంత‌నాల తుది ప‌లిత‌మే.. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం.

ఓటుకు నోటుతో కేసీఆర్ షాకిస్తే.. ఫోన్ ట్యాపింగ్ తో మాత్రం చంద్ర‌బాబు.. పెద్ద టైంబాంబును ప‌క్క‌న పెట్టేసి వ‌చ్చేశారు. అదే స‌మ‌యంలో.. తానెంత‌గానో మ‌న‌సు పారేసుకున్న హైద‌రాబాద్‌లో ఉండ‌టం అంత మంచిది కాద‌ని.. వెనువెంట‌నే త‌ట్టాబుట్టా స‌ర్దుకోక‌పోతే.. మొత్తంగా దెబ్బ ప‌డ‌టం ఖాయ‌మ‌న్న విష‌యం ఓటుకు నోటు ఇష్యూలో బాబుకు అర్థ‌మైంది. ప‌క్క ఊరు ప్రెసిడెంట్ లాంటిదే హైద‌రాబాద్‌లో త‌న ప‌రిస్థితి అన్న విష‌యం బాబుకు అర్థ‌మైంది. అందుకే.. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తాను చేయాల్సిన ప‌నిని చేసేసి ఆయ‌న‌.. త‌న దారిన తాను బెజ‌వాడ‌కు వెళ్లిపోయారు.

ఓటుకు నోటు కేసులో బాబుకు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఇక‌.. జ‌రిగేది కూడా ఏమీ లేదు. కానీ.. కేసీఆర్ విష‌యంలో మాత్రం కాస్త చిత్ర‌మైన వ్య‌వ‌హారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం టైమ‌ర్ లేని టైంబాంబు లాంటిది. అదెప్పుడు పేలుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. రాజ‌కీయాల్లో సుదీర్ఘంగా ఉన్న కేసీఆర్‌కు.. ఆ విష‌యం తెలియంది కాదు. అందుకేనేమో.. ఓటుకు నోటు విష‌యంలో త‌మ‌ను అడ్డంగా బుక్ చేశార‌న్న మాట‌ను కాస్త అటూఇటూగా చెప్పి.. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెల‌రేగిపోయినా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం పెద్ద‌గా రియాక్ట్ కాలేదు.

చంద్ర‌బాబు మీద విమ‌ర్శ చేసే ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌ని కేసీఆర్‌.. అందుకు భిన్నంగా బుధ‌వారం రాత్రి మీడియాతో మాట్లాడేట‌ప్పుడు త‌న స‌హ‌జ వైఖ‌రికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. బాబును తిట్టే అవ‌కాశం వ‌చ్చినా.. ఆయ‌న పెద్ద‌గా రియాక్ట్ కాకుండా నాలుగు మాట‌లు చెప్పేసి వ‌దిలేశారు. కేసీఆర్ లాంటి వ్య‌క్తి ఎదుటోళ్ల‌ను.. అందులోకి త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై మ‌సాలా పంచ్ డైలాగులు విసిరే అవ‌కాశాన్ని ఏ మాత్రం విడిచిపెట్ట‌రు. అందుకు భిన్నంగా.. విజ్ఞతకే వ‌దిలేస్తున్నానంటూ అంత సింఫుల్ గా ఎందుకు చెప్పిన‌ట్లు చూస్తే.. టైమ‌ర్ లేని టైంబాంబు లాంటి ట్యాపింగ్ య‌వ్వార‌మే అన్న మాట వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా.. బాబు విష‌యంలో కేసీఆర్ బుద్ధీగా ఉండ‌టం అంత చిన్న విష‌యం కాద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి.. ఇలాంటి వైఖ‌రిని ఇంకెంత కాలం కేసీఆర్ ప్ర‌దర్శిస్తారో చూడాలి.