Begin typing your search above and press return to search.

వివేక్ ను దూరం పెడుతున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   22 Jan 2019 10:08 AM GMT
వివేక్ ను దూరం పెడుతున్న కేసీఆర్
X
టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక క్రమంగా కొందరి ముఖ్య నేతల ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. ఇందులో ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వివేక్ దే. తాజాగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో టీఆర్ ఎస్ వివేక్ ను దూరం చేస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.

దివంగత గడ్డం వెంకటస్వామి(కాకా) కుటుంబానికి టీఆర్ ఎస్ తో దాదాపు సంబంధాలు తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాకా కుమారులు గడ్డం వినోద్, వివేక్ లు టీఆర్ ఎస్ లో చేరారు. తదనంతరం 2019 ఎన్నికల్లో వినోద్ కు టీఆర్ ఎస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమిపాలై పార్టీకి దూరంగా ఉంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్ కు టీఆర్ ఎస్ కేటాయించకపోవచ్చనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కేసీఆర్ చెప్పినా వినిపించుకోకుండా వెలుగు దినపత్రిక స్థాపించడం ఒకటి. వెలుగు పత్రిక ప్రస్తుతానికి టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నా రానున్న రోజుల్లో ఏకు మేకుగా మారుతుందని కేసీఆర్-కేటీఆర్ ఆందోళన చెందుతున్నారట.

అంతేకాకుండా టీఆర్ ఎస్ పై తిరుగుబావుట ఎగురవేయకుండా తన అన్న వినోద్ ను అడ్డుకోకుండా సహకరించారని కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ అభ్యర్థుల ఓటమి కోసం పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధిష్టానం ఆయనకు ఎంపీ టికెట్ కేటాయించకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది.

తాజాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించే అవకాశం కరీంనగర్ కు చెందిన ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు కేసీఆర్ ఇచ్చారు. ఆయనకు ఇప్పటికే కేబినెట్ లో స్థానం కల్పించారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు మంచి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా జిల్లాలో వివేక్ ప్రత్యామ్నాయ నేతను తయారు చేసుకుంటున్నారు. తాజా పరిణామాలన్నీ చూస్తుంటే వివేక్ ప్రాధాన్యం టీఆర్ ఎస్ లో రోజురోజుకు తగ్గుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివేక్ తన అన్నలాగా టీఆర్ ఎస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరీ వివేక్ టీఆర్ ఎస్ లో కొనసాగుతారా? లేక సొంత గూటికి చేరతారా అనేది పార్లమెంట్ ఎన్నికల వరకు తేలడం ఖాయంగా కనిపిస్తుంది. అంతవరకు వేచి చూడాల్సిందే మరీ.