Begin typing your search above and press return to search.

రఫేల్ ఎఫెక్ట్... ఈ ఊరి పేరు మార్చాల్సిందేనట

By:  Tupaki Desk   |   15 April 2019 2:28 PM GMT
రఫేల్ ఎఫెక్ట్... ఈ ఊరి పేరు మార్చాల్సిందేనట
X
బోఫోర్స్ పేరిట తెరపైకి వచ్చిన కుంభకోణం కాంగ్రెస్ పార్టీకి మాయని మచ్చను తెచ్చి పెడితే... రఫేల్ డీల్ నరేంద్ర మోదీ సర్కారుపై అదే తరహా మచ్చను వేసేసిందని చెప్పాలి. ఈ డీల్ తో బీజేపీ ప్రభుత్వం నానా పాట్లు పడుతుంటే... ఈ వివాదంతో ఏమాత్రం సంబంధం లేని ఓ కుగ్రామం కూడా నానా ఇబ్బందులు పడుతోంది. అసలు తమకు రఫేల్ వద్దే వద్దంటూ సదరు గ్రామ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అసలు తమకు రఫేల్ వద్దంటూ ఆ గ్రామస్థులు చేస్తున్న వాదన చాలా వింతగానే కాకుండా ఆసక్తికరంగానూ మారిపోయిందని చెప్పాలి. అయితా దేశ వైమానిక రంగానికి చెందిన రఫేల్ యుద్ధ విమానాలను వద్దని చెప్పాల్సిన అవసరం ఈ గ్రామ ప్రజలకు ఎందుకొచ్చిందన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగానే మారిపోయింది.

ఇక అసలు విషయంలోకి వెళితే... ఛత్తీస్ గఢ్ లోని మహా సముంద్ నియోజకవర్గంలోని ఓ గ్రామం పేరు రఫేల్. చాలా కాలం నుంచే ఈ గ్రామం ఇదే పేరుతో కొనసాగుతోంది. మొన్నటిదాకా ఎలాంటి ఇబ్బంది లేకున్నా... రఫేల్ డీల్ వివాదం కావడంతో ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు తక్షణమే తమ ఊరి పేరు మార్చాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఇందుకోసం వారంతా ఏకంగా సీఎంను కలిసేందుకు కూడా యత్నించారు. అయితే వారికి సీఎం అపాయింట్ మెంట్ దొరకకపోగా... కనీసం ఎన్నికల తర్వాత అయినా తమ ఊరి పేరును మార్చాలంటూ ఆ ఊరి పెద్ద ధరమ్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. అయినా అదేదో దేశానికి సంబంధించిన విషయంపై వివాదం రేగితే... ఈ ఊరి పేరు మార్చాలని ధరమ్ సింగ్ ను అడిగితే... ఆయన తమ ఆవేదనను వినిపించారు. రఫేల్ వివాదం నేపథ్యంలో దానితో ఏమాత్రం సంబంధం లేని తమ ఊపు బదనాం అయిపోతోందని, అందుకే ఊరి పేరును మార్చాలని కోరుతున్నామని ఆయన చెబుతున్నారు.

వివాదం రేకెత్తిన పేరును తమ గ్రామానికి కొనసాగించడం ద్వారా తమ ఊరికి అప్రతిష్ట వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన వాదిస్తున్నారు. ఊరిలో చాలా సమస్యలున్నాయని, ఇప్పటిదాకా తమ ఊరి గురించి పట్టించుకున్న నాథుడే లేడని కూడా ఆయన వాపోయారు. గ్రామంలో కనీసం తాగు నీరు, పారిశుద్ధ్యం కూడా లేదని, రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో ఊళ్లను దత్తత తీసుకున్నా... తమ గ్రామాన్ని సందర్శించిన నాథుడే లేడని ధరమ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా రఫేల్ డీల్ వివాదం నేపథ్యంలో ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న తమ ఊరి పేరును మార్చాలంటూ ఆ గ్రామస్థుల వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.