రేవంత్ రెడ్డికి - కంటెంట్ డైలాగ్స్ ఇచ్చేది అతనేనా?

Thu Sep 19 2019 07:00:01 GMT+0530 (IST)

తెలంగాణ పీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో మళ్లీ జోరు పెంచారు. అదేసమయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తూ తాను ప్రస్తావించే అంశాల్లో లోతుగా వెళ్తూ అధిష్ఠానం దృష్టిలో పడుతున్నారు. అయితే ఇదంతా రేవంత్ ప్రతిభ కాదని.. రేవంత్ కు ఒక మీడియా దిగ్గజం నుంచి బలమైన అండ దొరికిందని.. ఆ మీడియా దిగ్గజం టీం అందించే ఇన్ పుట్స్ - కంటెంట్... వారు రాసే డైలాగులే రేవంత్ రెడ్డి నోటి నుంచి వస్తున్నాయని కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది.కొద్దినెలల కిందటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన మీడియాలో వాటాదారుగా ఉన్న ఆ వ్యక్తి.. సంస్థను మిగతా వాటాదారులు ఓ రాజకీయ నేత అనుంగు మిత్రుడికి విక్రయించడంతో ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. అదేసమయంలో ఆ అమ్మకాలను అడ్డుకునేందుకు ఆ మీడియా అధిపతి అడ్డదారులు తొక్కారంటూ కేసులు వేయడంతో పోలీసులూ వెంటాడారు.

అనంతరం ఆయన కేంద్రంలోని బీజేపీ సహకారంతో మరో మీడియా సంస్థను నెలకొల్పి తనను రోడ్డుపాలు జేసిన నేత - ఆయన అనుంగు మిత్రుడిపై కసితీర్చుకోవాలని ప్రయత్నించినా బీజేపీ పెద్దగా అనుకూలంగా స్పందించలేదు. దీంతో ఆయన రూటు మార్చి రేవంత్ వైపు చేరారని.. రేవంత్ కు సలహాలు.. ఆ సలహాల ఆచరణ కోసం కంటెంట్ సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది. తనను రోడ్డు పాల్జేసిన ఆ తెలంగాణ నేత - ఆయన అనుంగు మిత్రుడు ఇద్దరూ రేవంత్ రెడ్డికి కూడా శత్రువులే కావడంతో తన శత్రువుపై పగ తీర్చుకోవడానికి ఆయన శత్రువైన రేవంత్ రెడ్డితో చేతులు కలిపినట్లు చెబుతున్నారు.

కాలం కలిసొచ్చి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయితే - తనకు మళ్లీ మంచి రోజులొస్తాయని ఆ మాజీ మీడియా అధినేత ఆశతో ఉన్నారట.. అందుకే రేవంత్ కు పూర్తి సహకారం అందిస్తున్నారట.