Begin typing your search above and press return to search.

మల్కాజిగిరిలో మామ మల్లారెడ్డికే సవాల్

By:  Tupaki Desk   |   24 March 2019 11:15 AM GMT
మల్కాజిగిరిలో మామ మల్లారెడ్డికే సవాల్
X
అత్యధిక జనాభాతోపాటు ఆంధ్రా ప్రజల ప్రాబల్యం ఎక్కువగా ఉండే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో జరిగే ఎన్నికల్లో ఆ ప్రాంతం వారే ఎక్కువగా గెలుస్తుంటారు. వివిధ పార్టీలు కూడా ఇక్కడ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. వలస వచ్చిన వారి ఓట్లే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని నిర్ణయిస్తాయి.

తాజాగా మల్కాజి గిరి పార్లమెంట్ సీటు నుంచి టీఆర్ ఎస్ తరుఫున అక్కడ విశేష బలమున్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు, యువ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని బరిలో దింపారు. ఇక కాంగ్రెస్ నుంచి ఉద్దండుడైన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి సైతం బలమైన ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ పడుతున్నారు. దీంతో హోరా హోరీ అభ్యర్థులున్న ఈ సీటులో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం టీఆర్ ఎస్ లో తీవ్ర పోటీ ఉంది. అయితే రాజకీయ సమీకరణాలన్నీ బేరీజు వేసిన అధిష్టానం మంత్రి మల్లారెడ్డి అల్లుడిని అభ్యర్థిగా బరిలో దింపింది. గెలుపు బాధ్యతను మంత్రి మల్లారెడ్డిపైనే మోపింది. మల్లారెడ్డి ఇక్కడ పోయిన సారి సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. దీంతో గట్టి పట్టున్న మల్లారెడ్డి తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు బాధ్యతను భూజానా వేసుకుంటానని కేసీఆర్ ను ఒప్పించి సీటు దక్కించుకున్నారని సమాచారం.

టికెట్ దక్కడంతో మల్లారెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. మల్కాజిగిరిలోని ద్వితీయ శ్రేణి నాయకులతో ఇప్పటికే సమావేశాలు పూర్తి చేశారు. మంగళవారం నుంచి నియోజకవర్గంలో విస్తృత స్థాయి లో ప్రచారం చేయనున్నారు. రాజశేఖర్ రెడ్డి విజయం మంత్రి మల్లారెడ్డి సవాల్ గా తీసుకొని ముందుకు సాగుతున్నారు.

*మల్కాజిగిరి చరిత్ర
2014 ఎన్నికల్లో మల్కాజిగిరలో టీడీపీ గెలిచింది. పోటీచేసిన మల్లారెడ్డి టీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు. అనంతరం టీఆర్ ఎస్ లో చేరాడు. తాజా ఎన్నికలకు వచ్చేసరికి అసలు టీడీపీ ఈ నియోజకవర్గంలో లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ తరుఫున రేవంత్ రెడ్డి పోటీపడుతుండగా.. బీజేపీ, జనసేనలు, స్వతంత్రంగా పోటీచేస్తున్నాయి. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి , లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, మాజీ డీజీపీ దినేష్ రెడ్డిలు బరిలోకి దిగారు. అయినా అందరినీ ఓడించి మల్లారెడ్డి తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలవడం విశేషం.

*మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా కొత్తే
ఈసారి టీఆర్ ఎస్ తరుఫున మల్కాజిగిరి లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతున్న మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా రాజకీయాలకు కొత్త. మామ మల్లారెడ్డి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీచేసిన సమయంలో తెరవెనుక అల్లుడు మంత్రాంగమంతా నడిపిడాని సమాచారం. మేడ్చల్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో రాజశేఖర్ రెడ్డికి బలముంది. తన గెలుపు బాధ్యతను ప్రస్తుతం మామ మల్లారెడ్డితో పాటు బంధువులపై ఉంచి ఎన్నికల కార్యక్షేత్రంలోకి దూకారు.