Begin typing your search above and press return to search.

భ‌ట్టికే చాన్స్‌..ఎంపిక అంతా లాంచ‌న‌మే!

By:  Tupaki Desk   |   17 Jan 2019 5:19 AM GMT
భ‌ట్టికే చాన్స్‌..ఎంపిక అంతా లాంచ‌న‌మే!
X
కొత్త అసెంబ్లీ కొలువుదీరనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) స‌మావేశం జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా మల్లు భట్టివిక్రమార్కను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైందని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. బుధవారం రాత్రి హైదరాబాద్‌ లో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కోర్‌ కమిటీ సమావేశం నిర్వ‌హించి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు - సీనియర్ నేతల అభిప్రాయాలను అధిష్ఠానం తెలుసుకుంది. ఈ మేరకు సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. సీఎల్పీ నేతగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - మల్లు భట్టి విక్రమార్క - శ్రీధర్‌ బాబు పేర్లు పరిశీలనకు వచ్చినట్టు సమాచారం.

గురువారం సీఎల్పీ కార్యాలయంలో జ‌రిగే సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి రామచంద్రకుంతియా - ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సమక్షంలోనే సీఎల్పీ నేత ఎన్నిక జరగనుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 19 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. వారిలో సీఎల్పీ పదవి కోసం ప‌లువురు సీనియ‌ర్ల నుంచి పోటీ తీవ్రంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎల్పీ పదవి ఆశిస్తున్న వారిలో టీపీసీసీ అధ్యక్షులు ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క - సబితా ఇంద్రరెడ్డి - శ్రీధర్‌ బాబు - కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఉన్నారని స‌మాచారం. అయితే, భ‌ట్టికే ప‌ద‌వి ద‌క్క‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశంలో ఈ మేర‌కు స్ప‌ష్టత వ‌చ్చిన‌ట్లు చెప్తున్నారు.