Begin typing your search above and press return to search.

చంద్రబాబు.. మీ కలల నగరంలో మీరెక్కడ?

By:  Tupaki Desk   |   24 Jun 2019 7:46 AM GMT
చంద్రబాబు.. మీ కలల నగరంలో మీరెక్కడ?
X
'అమరావతి' అది చంద్రబాబు నాయుడి కలల నగరం. అమరావతిని తనే సృష్టించబోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లూ చెప్పుకున్నారు. అది రాష్ట్రానికి సంబంధించిన అంశమే అయినా ఆ విషయంలో ఎప్పుడూ ఎవరి అభిప్రాయాలకూ చంద్రబాబు నాయుడు విలువను ఇవ్వలేదు!

రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం గురించి విభజన సమయంలో ఏర్పాటు అయిన శివరామకృష్ణ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసి - తను అనుకున్న చోట ఏపీ నూతన రాజధానిని ఏర్పాటు చేయబోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందుకోసం భారీ ఎత్తున భూ సేకరణ చేపట్టారు. బహుశా దేశంలోనూ - ప్రపంచంలోనూ మరెక్కడా జరగని స్థాయిలో అమరావతి కోసం భూ సేకరణ చేపట్టారు. ఆ విషయంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినా ఎవ్వరి అభిప్రాయాలకూ చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతను ఇవ్వలేదు. రాజధాని నిర్మాణానికి అమరావతి తగిన ప్రాంతం కాదనే అభిప్రాయాలు వినిపించినా - డిజైన్లు - గ్రాఫిక్స్ అంటూ ఐదేళ్ల కాలాన్ని చంద్రబాబు నాయుడు గడిపేశారు. ఎన్నికల్లో ఆయన గిమ్మిక్స్ అన్నీ చిత్తు అయ్యాయి. అదే అమరావతి ప్రాంతంలో ఆయన తనయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

ఇప్పుడు అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు పేరు చర్చకు వచ్చింది. అక్కడ చంద్రబాబుకు ఇప్పుడు సొంతిళ్లు లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడి వాళ్లనూ వచ్చి అమరావతిలో సెటిల్ కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ముంబై వెళ్లి అక్కడి జనాలు అమరావతికి వచ్చి సెటిల్ కావాలన్నారు చంద్రబాబు నాయుడు.అయితే తను అక్కడ సెటిల్ కావడాన్ని ఆయన మరిచిపోయారు!

అమరావతి ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి ఉండటం లేదని విమర్శించారు చంద్రబాబు నాయుడు. అయితే జగన్ మాత్రం సొంతిల్లు కట్టుకుని - తన పార్టీ కార్యాలయాన్నీ అక్కడే పెట్టుకుని సెటిలయ్యారు. ఆఖరికి పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్న పవన్ కల్యాణ్ కూడా అమరావతి ప్రాంతంలో ఇల్లు కలిగి ఉన్నట్టు అయ్యింది. అయితే ఎటొచ్చీ అమరావతి తన కలల నగరంగా ప్రకటించుకున్న చంద్రబాబు నాయుడుకు మాత్రం అక్కడ ఇల్లు లేకుండా పోయింది. ప్రభుత్వ ధనంతో కట్టిన 'ప్రజావేదిక'ను చంద్రబాబు నాయుడు క్రమబద్ధీకరించాలని కోరినా - దాన్ని తన అధికారిక నివాసం ఇవ్వాలని కోరినా.. అందుకు జగన్ ప్రభుత్వం నో చెప్పింది.

అదో అక్రమ కట్టడంగా తేల్చి దాన్ని కూల్చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? అద్దెకు అయినా ఇల్లు తీసుకుంటారా? లేక హైదరాబాద్ లో కట్టుకున్న ఇంటికి పరిమితం కాబోతున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది.