Begin typing your search above and press return to search.

కేసీఆర్.. జ‌గ‌న్ ల భేటీ! ఎప్పుడు.. ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   25 May 2019 4:34 AM GMT
కేసీఆర్.. జ‌గ‌న్ ల భేటీ! ఎప్పుడు.. ఎక్క‌డ‌?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌.. ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలు భేటీ కానున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ కావ‌టం.. ఆ త‌ర్వాత కేసీఆర్.. జ‌గ‌న్ లు భేటీ కావాల్సి ఉన్నా.. కాక‌పోవ‌టం తెలిసిందే.

ఎన్నిక‌ల వేళ‌లో.. ఈ ఇద్ద‌రు క‌లిస్తే లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ జ‌రుగుతుంద‌న్న అభిప్రాయంతో వీరి భేటీ జ‌ర‌గ‌లేద‌న్న వాద‌న ఉంది. తాజాగా వెల్ల‌డైన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో చారిత్ర‌క విజ‌యాన్ని సొంతం చేసుకున్న జ‌గ‌న్ ఈ రోజు (శ‌నివారం) తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌ల‌వ‌నున్నారు.

తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కాంగ్రెస్ తో జ‌త క‌ట్టి.. కూట‌మిగా పోటీ చేయ‌టం తెలిసిందే. దీనిపై కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. అదే అంశాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ.. సెంటిమెంట్ ను రేపటం.. త‌ద్వారా ఎన్నిక‌ల్లో ల‌బ్థి పొంద‌టం తెలిసిందే. త‌న‌ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్ట‌టానికి చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నానికి బ‌దులు తీర్చుకునేందుకు ఏపీలో జ‌గ‌న్ కు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తును కేసీఆర్ ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లు చెబుతారు.

అంతేకాదు.. కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఎపిసోడ్ లో జ‌గ‌న్ కు ఇర‌వైకు పైగా ఎంపీలు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టం.. త‌న‌కు వ‌చ్చే 15 ఎంపీలు (అంచ‌నా) వ‌చ్చి.. మొత్తంగా 35 మంది ఎంపీలు త‌మ చేతిలో ఉంటార‌ని.. కేంద్రంలో ఎవ‌రికి స‌రైన మెజార్టీ రాని ప‌క్షంలో తాము కీల‌క‌మ‌వుతామ‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉండ‌టం తెలిసిందే.

అయితే.. బీజేపీకి ఎవ‌రి అవ‌స‌రం లేకుండా సొంతంగానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేలా మెజార్టీని ఓట‌ర్లు క‌ట్ట‌బెట్టారు. అయిన‌ప్ప‌టికీ కేసీఆర్‌.. జ‌గ‌న్ ల మ‌ధ్య స‌హుద్భావ వాతావ‌ర‌ణం రెండు తెలుగు రాష్ట్రాల‌కు మేలు చేస్తుంద‌న్న అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఉంది. ఇరుగుపొరుగు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల కంటే కూడా స్నేహ‌భావం ఉంటే.. ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి ఉంటుంద‌ని.. అది చాలా అవ‌స‌ర‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు కేసీఆర్ మ‌ధ్య సంబంధాలు అంతంత‌మాత్రంగా ఉండేవి. తాజాగా మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య రిలేష‌న్ బాగుంటుంద‌న్న అభిప్రాయం ఉంది.

ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత తొలిసారి హైద‌రాబాద్ వ‌స్తున్న జ‌గ‌న్ గ‌న్న‌వ‌రం నుంచి హైద‌రాబాద్ కు ఈ సాయంత్రం చేరుకుంటారు. నేరుగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో భేటీ కానున్నారు. దాదాపు అర‌గంట పాటు అక్క‌డే ఉండ‌నున్నారు. అనంత‌రం రాజ్ భ‌వ‌న్ నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వెళ్ల‌నున్నారు. సీఎం కేసీఆర్ తో భేటీ అయి.. ఈ నెల 30న త‌న ప్ర‌మాణ‌స్వీకార‌మ‌హోత్స‌వానికి కుటుంబ స‌మేతంగా హాజ‌రు కావాలంటూ ఆహ్వానాన్ని అందిచ‌నున్నారు. ఇప్ప‌టికే ఫోన్ లో కేసీఆర్ తో మాట్లాడిన జ‌గ‌న్‌.. త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి రావాలంటూ ఆయ‌న్ను కోరిన సంగ‌తి తెలిసిందే. ఇరువురు అగ్ర‌నేత‌ల భేటీ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.