Begin typing your search above and press return to search.

నోబెల్ బహుమతి అందుకున్న మనోడు తీహార్ జైలు ఖైదీ తెలుసా?

By:  Tupaki Desk   |   15 Oct 2019 8:42 AM GMT
నోబెల్ బహుమతి అందుకున్న మనోడు తీహార్ జైలు ఖైదీ తెలుసా?
X
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న భారత సంతతి ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ గురించి ఆసక్తికర విషయమొకటి ఇప్పుడు బయటకొచ్చింది. గతంలో ఆయనే ఓ సందర్భంలో వెల్లడించిన ఆ విషయం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. అభిజిత్ చాలాకాలం కిందట తీహార్ జైల్లో గడపాల్సివచ్చిందట. అంతగొప్ప విద్యావంతుడు - ఆర్థిక వేత్త బడాబడా నేరస్తులుండే తీహార్ జైలుకు ఎందుకు వెళ్లారో తెలుసా? కారణం.. రాజకీయాలే. అవును - రాజకీయ కారణాలతోనే ఆయన అరెస్టయ్యారట. అప్పుడాయన పది రోజుల పాటు జైలు జీవితం గడిపారట.

దిల్లీలోని జవహర్ లాల్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో విద్యార్థుల అందోళనలో పాల్గొన్నపుడు ఈ సంఘటన జరిగింది. 2016లో జేఎన్‌ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్‌ ను రాజద్రోహం కింద అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపిన సందర్భంలో అభిజిత్ తన అనుభవాన్ని హిందూస్తాన్ టైమ్స్ పత్రికలో వ్యాసంగా రాశారు.

తాను జేఎన్‌ యూలో చదువుకుంటున్నప్పుడు అందరితో పాటు ఆందోళన చేస్తే కుళ్లబొడిచి తీహార్ జైల్లో వేశారని.. అయితే, తమపై రాజద్రోహం కేసు పెట్టలేదని అప్పట్లో ఆయన రాసుకొచ్చారు. వైస్ చాన్సలర్ తోపాటు మరికొందరిని హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ హత్యా నేరం కేసు పెట్టారని ఆయన అప్పటి తన వ్యాసంలో గుర్తుచేసుకున్నారు. పది రోజుల పాటు జైలులో ఉన్న తరువాత బెయిలుపై బయటకొచ్చినట్లు చెప్పారు. అనంతరం కొంత కాలానికి కేసులు కొట్టేశారని గుర్తు చేసుకున్నారు.

అప్పటికి దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. విద్యార్థులు ఉద్యమించడంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి చేసి అరెస్టులు చేయించిందని ఆయన తన వ్యాసంలో రాశారు. ‘మేమే రాజులం, నోరు మూసుకుని చెప్పినట్లు వినండి’ అని మాకు చెప్పడానికే అలా కేసులు పెట్టారని ఆయన తన వ్యాసంలో రాశారు. తనకాలం నాటి అరెస్టులకు, 2016లో కన్నయ్య కుమార్ అరెస్టును పోలుస్తూ ఆయన రెండు సందర్భాల్లో ప్రభుత్వం యూనివర్సిటీలను చెప్పుచేతుల్లోకి తీసుకోవడానికి - ప్రబుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించకుండా అడ్డుకోవడడానికి ప్రయత్నించడమేనన్నారు.