Begin typing your search above and press return to search.

సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓడిపోయిన బాబు - జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   16 Jan 2018 3:47 PM GMT
సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓడిపోయిన బాబు - జ‌గ‌న్‌
X
సొంత నియోజ‌క‌వ‌ర్గానికి మేలు చేయ‌లేని, జ‌న్మించిన నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓడిపోయిన వ్య‌క్తి తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సొంత‌మ‌ని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా టూర్‌లోనే సంక్రాంతిని జ‌రుపుకొన్న వైఎస్ జ‌గ‌న్ అనంత‌రం పాద‌యాత్ర‌లో ప్ర‌సంగించారు. సంక్రాంతి సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం పారకాల్వ క్రాస్‌ వద్ద ఆయన సోమవారం ఉదయం పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచె క‌ట్టి, కండువా ధరించారు. ఈ సందర్భంగా దివంగ‌త వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నూతన వస్త్రాలు సమర్పించారు. వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, సునీల్‌ కుమార్‌ రెడ్డి, నారాయణస్వామితో పాటు పార్టీ నేతలు భూమన కరుణాకర్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డితో పాటు స్థానిక నాయకులు, పాదయాత్ర బృందం కూడా పాలుపంచుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు వైఎస్‌ జగన్‌ విరామం ఇచ్చారు. పారకాల్వ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాదయాత్ర శిబిరంలోనే ఉన్నారు.

అనంత‌రం పాద‌యాత్రలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ చంద్రగిరి టీడీపీకి ప్రత్యేకమైన నియోజకవర్గమ‌ని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియోజకవర్గంలోనే జన్మించారని చెప్పారు. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారని, తన రాజకీయ ప్రస్థానాన్ని చంద్ర‌బాబు ఇక్కడి నుంచే ప్రారంభించారని జగన్ గుర్తు చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో చంద్రబాబు మంత్రి అయ్యారని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతుందని, ఏ ఒక్క సామాజిక వర్గం కూడా సంతోషంగా లేరని జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం రాగానే ప్రతి పేదవాడికి భరోసా కల్పిస్తానని, విద్యా, వైద్యం కోసం పేదవాడు అప్పుల పాలు కాకూడదన్నదే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలోనే పెట్రోలు, డీజిల్‌ ధరలు ఉన్నాయని, ప్రజల జేబులను నాలుగేళ్లుగా చంద్రబాబు ఖాళీ చేస్తున్నారని జగన్‌ ధ్వజమెత్తారు.

చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కూడా సహకార ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని జ‌గ‌న్ వెల్ల‌డించారు. `సహకార ఫ్యాక్టరీలు నడిస్తే రైతులకు మంచి రేట్లు వస్తాయి. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కూడా ఈ ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఈ రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. రైతులు అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ చక్కెర ఫ్యాక్టరీ బకాయిలు కట్టి తెరిపించారు. నాన్న అంటూ పదేళ్ల పాటు రైతులు సంతోషంగా ఉన్నారు. మళ్లీ చంద్రబాబు సీఎం కావడం, ఆ రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటం జరిగింది. ఆశ్చర్యం ఏంటో తెలుసా ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు మాత్రం లాభాల మీద లాభాలు వస్తున్నాయి. రైతులు వాళ్లకు ఇష్టం ఉన్నా..లేకున్నా ప్రైవేట్‌ పరిశ్రమలకు అమ్ముకోవాల్సి వస్తుంది.` అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు పాలన గురించి ఆలోచన చేయండని ప్ర‌జ‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ పిలుపునిచ్చారు. `సీఎం అయ్యేందుకు చంద్రబాబు ఏమన్నారు..కరెంటు బిల్లులు షాక్‌కొడుతున్నాయి. అధికారంలోకి రాగానే కరెంటు బిల్లులు తగ్గిస్తా అన్నాడు. గతంలో రూ.50 - 100 లోపు కరెంటు బిల్లులు వచ్చేవి. ఇప్పుడు రూ.500 - 600 - 1000 చొప్పున వస్తున్నాయి. గతంలో రేషన్‌షాపుల్లో 9 రకాల సరుకులు దొరికేవి. ఇవాళ బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. పండుగొచ్చిందంటే చాలు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు. విఫరీతంగా పెట్రోలు చార్జీలు పెంచారు. ప్రతి పేదవాడికి మూడుసెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తామని చంద్రబాబు అన్నాడు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..ఒక్క ఇల్లైనా కట్టించాడా? . నాడు బ్యాంకుల్లో పెట్టిన రుణాలు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత మీ బంగారం ఇంటికి వచ్చిందా?. బ్యాంకుల నుంచి వేలం నోటీసులు ఇంటికి వస్తున్నాయి. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ. 2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ప్రతి ఇంటికి రూ.90 వేలు చంద్రబాబు బాకీ పడ్డాడు. ఎప్పుడైనా ఆయన కనిపిస్తే నా రూ.90 ఇవ్వమని నిలదీయండి. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చాడు. నాలుగేళ్ల తరువాత మీ రుణాలు మాఫీ అయ్యాయా? రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. ప్రతి పేజీలో నుంచి ఒక కులాన్ని ఎలా మోసం చేయాలో టీడీపీ మేనిఫెస్టోలో కనిపిస్తుంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలు రావాలి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్మరని చంద్రబాబుకు తెలుసు అందుకే ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తామంటారు.` అని ఎద్దేవా చేశారు. రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని కోరుకుంటున్నాన‌ని జ‌గ‌న్ తెలిపారు.