Begin typing your search above and press return to search.

వాట్సాప్ లో షేర్ లైవ్ లొకేష‌న్ ఫీచ‌ర్‌!

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:30 PM GMT
వాట్సాప్ లో షేర్ లైవ్ లొకేష‌న్ ఫీచ‌ర్‌!
X

ఈ ఇంట‌ర్నెట్ జ‌మానాలో సోష‌ల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఆరేళ్ల పిల్లాడి నుంచి అర‌వై ఏళ్ల వృద్ధుల వ‌ర‌కు చాలామంది ఫేస్ బుక్‌ - వాట్సాప్ - ట్విట్ట‌ర్ ల‌ను ఉప‌యోగిస్తున్నారు. నిత్య జీవితంలో వాట్సాప్ ఒక భాగ‌మైందంటే అతిశ‌యోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సాప్ ఎప్ప‌టిక‌పుడు అప్ డేట్ అవుతూ స‌రికొత్త అనుభూతిని పంచుతోంది. తాజాగా వాట్సాప్ త్వ‌ర‌లో మరో రెండు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాల‌ని యోచిస్తోంది. స్నేహితులతో మ‌న‌ రియల్‌-టైమ్ లొకేషన్ ను షేర్ చేసుకునేందుకు వీలుగా ‘లైవ్ లొకేషన్’ ఫీచ‌ర్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. మ‌న లొకేష‌న్ ను సురక్షితమైన ఎన్ క్రిప్టెడ్‌ పద్ధతిలో అవతలి వారికి చెప్పేందుకు ఈ ఫీచ‌ర్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఫీచ‌ర్ పూర్తిగా ఎండ్‌ టు ఎండ్ ఎన్‌స్క్రిప్సన్ భద్రత క‌లిగి ఉంది. దీంతో, మ‌న‌కు కావాలిసిన వారితో, కావ‌ల‌సినంతసేపు లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవ‌చ్చు. మ‌నం వ‌ద్ద‌నుకుంటే ఏ టైమ్‌లోనైనా షేరింగ్ ఆపెయ్యొచ్చు. కావ‌ల‌సినంత స‌మ‌యాన్ని టైమర్ ద్వారా ఫిక్స్ చేసుకోవ‌చ్చు. నిర్దేశించిన టైమ్ ముగిసిపోగానే ఆటోమేటిక్ గా షేరింగ్ ఆగిపోతుంది. 15 నిమిషాల నుంచి 8 గంటల వరకు లైవ్ లొకేషన్ షేర్ చేసుకొనే సదుపాయం ఉంది. ఈ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ అందుబాటులోకి రానుంది.

ముందుగా మ‌నం ఎవరితో లొకేష‌న్ షేర్ చేసుకోవాలనుకుంటున్నామో వారితో చాట్ ఓపెన్ చేయాలి. ఎటాచ్ బటన్‌లో ‘‘లొకేషన్’’ తరహాలోనే ‘‘షేర్ లైవ్ లొకేషన్’’ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. లొకేష‌న్‌ షేర్ చేసుకోవాలనుకుంటున్న స‌మ‌యాన్ని ఎంచుకుని సెండ్ మీద ట్యాప్ చేయాలి.

దీంతో, అవ‌త‌ల చాటింగ్‌ లో ఉన్న వ్యక్తి మ‌న‌ రియల్ టైమ్ లొకేషన్ ని మ్యాప్‌లో చూడగలుగుతారు. యూజర్లు తమ లైవ్ లొకేషన్‌ ను అవతలి వాట్సాప్ యూజర్లకు లేదా వాట్సాప్ గ్రూప్ నకు షేర్ చేయవచ్చు. ఒక గ్రూప్‌ లో ఒకరికంటే ఎక్కువ మంది రియల్ టైమ్ లొకేషన్ షేర్ చేసుకుంటే... అదే మ్యాప్‌లో అందరి లొకేషన్లు కనిపిస్తాయి.

వాట్సాప్ మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్ ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఇకపై మ‌న ఫోన్ నంబ‌ర్ మారిన‌పుడ‌ల్లా మ‌న స్నేహితులకు విడివిడిగా కొత్త నంబ‌ర్ చెప్పే ప‌నిలేదు. త్వ‌ర‌లోనే ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ ఫోన్ నంబర్ చేంజ్ నోటిఫికేషన్ తో కొత్త ఫోన్ నంబర్ ను ఒక్కసారి షేర్ చేసుకుంటే మిత్రులందరికీ ఒకేసారి నంబర్ మారినట్టు నోటిఫికేషన్ వెళుతుంది. ఈ రెండు సరికొత్త ఫీచర్లతో పాటు కొత్తవెర్షన్‌లో యాప్ సైజును కూడా తగ్గించాలని వాట్సాప్ భావిస్తోంది.