ఎవరీ ద్రౌపది ముర్ము..?

Mon May 15 2017 11:05:52 GMT+0530 (IST)

నిన్న మొన్నటి వరకూ పెద్దగా వినని పేరు ద్రౌపది ముర్ము. కానీ.. పది రోజుల క్రితం నుంచి తరచూ మీడియాలో ఆమె పేరు మారుమోగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ ఆదివాసీ మహిళ.. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి కుర్చీలో కూర్చునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జార్ఖండ్‌కు చెందిన ఒక ఆదివాసీ మహిళ కమ్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రపతి అయిపోగలరా? అంటే.. ప్రధాని మోడీ కానీ తలుచుకుంటే ఇవేమీ పెద్ద విషయాలు కావు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ను.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఊహించామా?

తాజాగా తెరపైకి వచ్చిన ద్రౌపది ముర్ము వ్యవహారం కూడా ఇలాంటిదే కావొచ్చు. రెండేళ్ల క్రితం మే లోనే ఈ ఒడిశా మాజీ బీజేపీ ఎమ్మెల్యే అనూహ్యంగా జార్ఖండ్ గవర్నర్ గా ఎంపికైనట్లు వార్తలు రావటమే కాదు.. అనూహ్యంగా ఆ పదవిని చేపట్టేశారు. అత్యంత నాటకీయంగా సాగిన ఈ ఉదంతాన్ని తాను అస్సలు ఊహించలేదని చెబుతారు ద్రౌపది ముర్ము. అన్ని అనుకున్నట్లు సాగితే.. మరికొద్ది రోజుల్లో ఆమె.. రాంచీ నుంచి ఢిల్లీకి తన సరంజామాతో చిరునామాను మార్చుకోవాల్సి రావొచ్చు.

జులై 25 నాటికి రాష్ట్రపతిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్న ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం పూర్తి కానుంది. ఈ లోపే.. రాష్ట్రపతి ఎన్నిక కసరత్తు పూర్తి అవుతోంది. దేశ అత్యున్నత పదవి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్న వేళ.. ఎక్కడో రాంచీలో తన పని తాను చేసుకుంటూ పోతున్న ద్రౌపదిని ఈ పదవి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ అంచనాలు ఎంతవరకూ నిజం అవుతాయో చూడాలి.

ద్రౌపది కానీ రాష్ట్రపతి కుర్చీలో కూర్చుంటే.. దేశంలోని ఆదివాసీలకు గుర్తింపు రావటమే కాదు.. ఇప్పటి వరకూ ఆ వర్గానికి అత్యున్నత పదవి ఏదీ దక్కలేదన్న కొరత కూడా తీరటం ఖాయం. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కాలేజ్‌లో బీఏ చదివిన ద్రౌపది.. రాయ్ రంగపూర్ లోని ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో గౌరవ సహాయక ప్రొఫెసర్ గా ఉన్నారు. కొద్దికాలం ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేశారు. రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో పలు పదవులు చేపట్టినా.. ఒడిశా మంత్రిగా వ్యవహరించినా.. మిగిలిన బీజేపీ మహిళా నేతల మాదిరి మీడియాలో పెద్దగా ఫోకస్ అయ్యింది లేదు. మృదుభాషిణిగా పేరున్న ఆమె.. గిరిజనుల సంక్షేమం కోసం.. మహిళల వృద్ధి కోసం ఎంతో కృషి చేసినట్లుగా చెబుతారు.

స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. 39ఏళ్ల వయసులో నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2000.. 2004లో రాయ్ రంగపూర్ నుంచి బీజేపీ తరఫు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజాప్రతినిధిగా ఆమె చేసిన సేవలకు ఒడిశా లెజిస్లేటివ్ అసెంబ్లీ ముర్ముకు 2007లో పండిట్ నీలకంఠ అవార్డును ప్రదానం చేశారు.

ద్రౌపది జీవితంలో బోలెడంత విషాదం ఉంది. గుండె లోతుల్లో బడబాగ్నులున్నా.. అవేమీ బయటకు కనిపించకుండా పంటి బిగువున ఆమె వాటిని నిశ్శబద్దంగా భరిస్తుంటారని చెబుతారు. భర్త.. ఇద్దరు కొడుకు మరణించటంతో జీవితంలో ఇంకేం లేనట్లుగా భావించి.. నిర్వేదంలోకి కూరుకుపోయారు. ఉద్యోగాన్ని మానేసి.. కూతుర్ని పెంచుకుంటూ ఇంటికే పరిమితమైన ఆమె.. నెమ్మదిగా ఆధ్యాత్మికం వైపు వెళ్లారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె..గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేశాక మొదటగా చేసిన పది పూరికి వెళ్లి.. జగన్నాథుడి దర్శనం చేసుకోవటమే. 59 ఏళ్లలో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు నిజమైతే.. దేశ తొలి అదివాసీ మహిళా రాష్ట్రపతిగా గుర్తింపు సొంతం చేసుకోవటం ఖాయం. సాదాసీదాగా ఉండే ద్రౌపది లోప్రొఫైల్ మొయింటైన్ చేయటమే కాదు.. ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటారు. జరిగేది ఏదైనా దైవ నిర్ణయమేనని నమ్మే ఆమె.. రాష్ట్రపతి పదవికి తన పేరు వినిపించటాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. మరి.. ద్రౌపది విషయంలో దైవనిర్ణయం ఎలా ఉందో..?