Begin typing your search above and press return to search.

కేవీపీ..బాబుపై కోపాన్ని కక్కలేరు..మింగలేరు..!

By:  Tupaki Desk   |   20 Nov 2018 5:06 PM GMT
కేవీపీ..బాబుపై కోపాన్ని కక్కలేరు..మింగలేరు..!
X
రాజకీయం.... ఈ పదమే పదవికి పరమార్ధం. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎవరితో కలుస్తారో... ఎవరు ఎవరిని ఎప్పుడు దుమ్మెత్తిపోస్తారో.... ఎవరు ఎవరికి మిత్రులవుతారో.... శత్రువులవుతారో చెప్పలేని రంగం. అందుకే చాలా మంది రాజకీయ నాయకులు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఎవరిపైనానోరు జారరు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఇందుకు తాజ ఉదాహరణ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు - రాజ్యసభ సభ్యుడు కె.వి.పీ. రామచంద్రరావు పరిప్థితి ఇరకాటంలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి - తన ఆత్మ అయిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి బతికుండగా ఓ వెలుగు వెలిగిన కె.వి.పి.రామచంద్రరావు ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా వై.ఎస్.రాజశేఖర రెడ్డి బతికుండగా నారా చంద్రబాబు నాయుడిపై కారాలు మిరాలు నూరిన కె.వి.పీ.రామచంద్రరావు వై.ఎస్.మరణం తర్వాత ఏమీ మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిపోయారు. గడచిన నాలుగేళ్లుగా అడపాదడపా ఆంధ‌్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖలు రాసిన కె.వి.పీ.రామచంద్రరావు తాజా పరిస్థితుల నేపథ్యంలో ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఈపాటికే అర్ధం అయి ఉంటుంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో దశాబ్దాల వైరాన్ని మరచి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కలవడంతో కె.వి.పి.రామచంద్రరావు పరిప్థితి మింగలేక.... కక్కలేక ఉన్నట్లుగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసే ప్రతీ పనిలో తప్పులు ఎత్తి చూపుతూండే వారు కె.వీ.పీ. రామచంద్రరావు. అయితే కాంగ్రెస్ తో తాజా దోస్తీ కారణంగా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎలాంటి విమర్శలు చేయలేకపోతున్నారు. అంతే కాదు.... కనీసం తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లను చంద్రబాబు నాయుడు మారుస్తున్నా కనీసం నిరసన తెలపలేక పోతున్నారు కే.వీ.పీ. రామచంద్రరావు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి ఉదాహరణగా పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు ఇందిరా సాగర్ ప్రాజెక్టు అని నామకరణం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు

అధికారంలోకి రావడంతో ఈ పేరును తుంగలో తొక్కి పోలవరం ప్రాజెక్టు పేరుతో వ్యవహరిస్తున్నారు. దీనిపై కూడా కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా కె.వీ.పీ.రామచంద్రరావు వంటి నాయకులు విమర్శించడం మాట దేవుడెరుగు.... కనీసం ప్రస్తావించే అవకాశం కూడా లేకుండా పోయింది ఆం‌ధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులకు. ముఖ్యంగా కె.వీ.పీ.రామచంద్రరావు వంటి సీనియర్ నాయకులకు చంద్రబాబు నాయుడితో పొత్తు మింగలేక.... కక్కలేక అన్నట్లుగా తయారైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.