Begin typing your search above and press return to search.

ఆ దేశంలో వారానికి 2 రోజులే పనంట

By:  Tupaki Desk   |   27 April 2016 10:30 PM GMT
ఆ దేశంలో వారానికి 2 రోజులే పనంట
X
నమ్మశక్యంగా అనిపించకున్నా ఇది నిజం. వారానికి ఐదు రోజుల పని చేయటం మామూలే. కానీ.. అందుకు భిన్నంగా వారానికి కేవలం రెండు రోజులు మాత్రమే పని చేయమని కోరుతోంది వెనిజులా సర్కారు. అక్కడి ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులను కేవలం రెండు రోజులే పని చేయాలని కోరుతోంది. వారంలో రెండు రోజులు మాత్రమే పనా? అన్న ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటానికి వెనుక పెద్ద కారణమే ఉంది.

ఇప్పుడా దేశంలో తీవ్రమైన విద్యుత్ కొరతను నెలకొని ఉంది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఆ దేశంలో విద్యుదుత్పత్తి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు మరింత పెరిగిన కరువుతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో.. విద్యుత్ ఉత్పత్తికి తగ్గట్లుగా పని దినాల్ని ప్రభుత్వం రెండు రోజులకు కుదించి వేసింది.

సుమారు 20 లక్షల మంది ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఐదు రోజుల ఆఫీసులకు రాకపోతే.. విద్యుత్ వినియోగం భారీగా తగ్గుతుందని లెక్కలేసిన ప్రభుత్వం.. తాజాగా వారానికి రెండు రోజులు పని చేస్తే సరిపోతుందని సెలవిచ్చారు. వర్షాలు కురిసి.. విద్యుత్ ఉత్పత్తి పెరిగే వరకూ వారానికి రెండు రోజులే పని అని చెబుతున్నారు.