కమలనాథులకు క్లారిటీ సమస్య!

Sun Dec 09 2018 22:42:58 GMT+0530 (IST)

తెలంగాణ కమలనాథులకు క్లారిటీ సమస్య ఎదురవుతోందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. హోరాహోరిగా సాగిన తెలంగాణ ఎన్నికల పోరులో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితం రావడానికి ముందే ఆ పార్టీలో అస్పష్టత నెలకొందని అంటున్నారు. అధికారంలో వస్తామని ధీమా వ్యక్తం చేసిన నేతలు ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో పొత్తుల విషయంలో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఒకరేమో పొత్తుకు సిద్ధం..మా మద్దతు లేకుండా ఏ సర్కారు ఏర్పడదని అంటుంటే..మరో నేతనేమో తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమంటున్నారు. ఇంకో నేత అయితే...షరతులు విధిస్తూ ప్రచారం గురించి వెల్లడిస్తున్నారు. దీంతో టీ బీజేపీ నేతలకు తమ ఎన్నికల పయనం గురించి స్పస్టత ఉందా? అనే చర్చ జరుగుతోంది.తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందిస్తూ తమ మద్దతు లేకుండా తెలంగాణలో ఏ ప్రభుత్వం ఏర్పడబోదని ప్రకటించారు. తెలంగాణలో ఒకవేళ పూర్తి మద్దతు దక్కకపోతే - టీఆర్ ఎస్ పార్టీకి తాము మద్దతు ఇస్తామని అయితే వారు ఎంఐఎంకు గుడ్ బై చెప్పాలని షరతు విధించారు. 60 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఎన్నికల్లో  పోటీచేశామని  మెజార్టీ స్ధానాల్లో గెలుపొందుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే  ఎవరికి మద్దతివ్వాలనే అంశాన్ని కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని లక్ష్మణ్ తెలిపారు.

అయితే బీజేపీ తెలగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు స్పందిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఒకవేళ హంగ్ ఏర్పడితే తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. తద్వారా తమ అధ్యక్షుల వారికి భిన్నమైన ప్రకటన చేశారు. కాగా బీజేపీకి చెందిన జాతీయ రాజకీయ నాయకురాలు - ఏపీకి చెందిన దగ్గుబాటి పురందీశ్వరి స్పందిస్తూ తెలగాణలో తాము టీఆర్ ఎస్ కు మద్దతిస్తామని అయితే వారు ఎంఐఎం మద్దతు తీసుకోవద్దన్నారు. ఇలా బీజేపీ నేతలు ఒక్కొక్కరు విభిన్నమైన ప్రకటనలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. కాగా ఈ ప్రకటనలపై టీఆర్ ఎస్ శ్రేణులు ఆసక్తికరంగా స్పందిస్తున్నాయి. అసలు తమకు ఎవరి మద్దతు అవసం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.