Begin typing your search above and press return to search.

హుస్సేన్ సాగర్ ఏ క్షణమైనా..?

By:  Tupaki Desk   |   23 Sep 2016 10:00 AM GMT
హుస్సేన్ సాగర్ ఏ క్షణమైనా..?
X
అతివృష్ఠితో నానా కష్టాలు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు ఇప్పుడు మరో ప్రమాదం పొంచి ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో అది నిండుకుండలా మారింది. ఏ క్షణమైనా పొంగి పొర్లక తప్పదన్నట్లుగా ఉండడంతో సాగర్ దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా హుస్సేన్ సాగర్ కు భయపడాల్సిన పరిస్థితి రాలేదు.

హుస్సేన్‌ సాగర్‌ లో నీరు పూర్తి స్థాయికంటే ఎక్కువగా వచ్చి చేరుతున్నాయి. హుస్సేన్‌ సాగర్‌ ప్రస్తుత నీటి మట్టం 513.89 మీటర్లు. కాగా పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు మాత్రమే. హుస్సేన్‌ సాగర్‌ లోకి వచ్చి చేరుతున్న నీరు 6 వేల క్యూసెక్కులు. సాగర్‌ నుంచి బైటికి వెళుతున్న నీరు 5,200 క్యూసెక్కులు. దీంతో ఇప్పటికే సాగర్ దిగువ ప్రాంతంలోని నాలాలు పొంగి పొర్లుతున్నాయి. నాచారం నాలా ఉదృతంగా ప్రవహిస్తూ రహదారిని ముంచెత్తడంతో అధికారులు నాచారం- మల్లాపూర్ రహదారిని మూసివేశారు. ఒక పెద్ద నదిని తలపించేలా నాచారం నాలా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారి జలమయమైంది. మోకాలి లోతులో నీటి ప్రవాహం మహోధృతంగా ఉండటంతో నీటి వడి తగ్గే వరకూ ఈ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.

పలు ఇతర ప్రాంతాల్లోనూ మూసీ నది - నాలాలు పోటెత్తాయి. నిజాంపేట ప్రాంతంలో నాలుగు రోజులుగా కొన్ని అపార్టుమెంట్లు నీట్లోనే ఉండడంతో అవి కూలే ప్రమాదముందని.. ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే సాగర్ కింది ప్రాంతంలో బేగంపేటలోని పలు ప్రాంతాలు కూడా నీట్లో చిక్కుకపోయాయి. మొత్తానికి ఎన్నడూ లేనట్లుగా హైదరాబాద్ జల దిగ్బంధంలో చిక్కుకుని విలవిలలాడుతోంది.