Begin typing your search above and press return to search.

అమ్ర‌పాలి చెప్పిన దెయ్యం క‌థ‌!

By:  Tupaki Desk   |   15 Aug 2018 6:08 AM GMT
అమ్ర‌పాలి చెప్పిన దెయ్యం క‌థ‌!
X
ఒక ఐఏఎస్ అధికారిణి త‌ర‌చూ వార్త‌ల్లోకి రావ‌టం.. అందులోనూ వివాదాల‌తోనో.. మ‌రింకో కార‌ణంతోనో ఉండ‌టం చాలా అరుదు. అయితే.. అదేమంత పెద్ద క‌ష్టం కాద‌న్న విష‌యాన్ని తన తీరుతో ఎప్పుడో ఫ్రూవ్ చేసుకున్నారు వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి.

ఇంత చెప్ప‌ట‌మంటే.. ఆమెను నెగిటివ్ చేయ‌టం కాదు. ఆమె ఈ త‌రానికి ప్ర‌తినిధిగా చెప్పాలి. ఐఏఎస్ ల‌లో క‌నిపించే తీరుకు భిన్నంగా ఆమె ఉంటారు. ఆమె మాట‌లు చూస్తే.. మ‌రో ప‌ది.. ప‌దిహేనేళ్ల త‌ర్వాత క‌లెక్ట‌ర్లుఎలా మాట్లాడ‌తారో ఆమె అలా మాట్లాడ‌తారు. త‌న మ‌న‌సులో ఉన్న‌ది చెబుతారు. హుందాత‌నం బంధిఖానాలో ఉండ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు.

జ‌నం ముందు ఒక‌లా.. వ్య‌క్తిగ‌తంగా మ‌రోలా ఉండ‌టం ఆమెకు ఇష్టం ఉండ‌దు. నిజం ఏదైతే.. దాన్నే చెప్ప‌టానికి.. ప్రాక్టిక‌ల్ గా ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తారు. ఇదే ఆమెను త‌ర‌చూ ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. మిగిలిన వారికి భిన్నంగా ఉంచుతుంది.

తాజాగా ఆమె చెప్పిన మాట‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏ ప్ర‌ముఖుడు త‌న భ‌యాల్ని బ‌య‌ట‌కు చెప్పుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. గుంభ‌నంగా ఉంటారు. అలా చేస్తే ఆమె అమ్ర‌పాలి కారు. ఆమె గురించి మ‌నం చెప్పుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉండేది కాదు. ఈ మ‌ధ్య‌నే ప్రేమ వివాహం చేసుకున్న అమ్ర‌పాలి తాజాగా వార్త‌ల్లోకి ఎందుకు వ‌చ్చార‌న్న‌ది చూస్తే.. ఒక ఛాన‌ల్ తో మాట్లాడుతూ.. త‌న‌కు దెయ్యాలంటే భ‌య‌మ‌ని.. దెయ్యం ఎక్క‌డో లేద‌ని.. త‌న అధికారిక నివాసంలో ఉందని చెప్పుకొచ్చారు.

ఈ నెల (ఆగ‌స్టు) 10 నాటికి వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌య నిర్మాణానికి పునాది రాయి వేసి 133 ఏళ్లు నిండింది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని తాను ఉండే ఇంటికి సంబంధించిన చారిత్ర‌క విశేషాల్ని ఆమె వెల్ల‌డించారు. జార్జ్ పామ‌ర్ అనే ఆయ‌న వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేశార‌ని తెలిసి.. ఆయ‌న‌కు సంబంధించిన విశేషాలు తెలుసుకోవాల‌న్న ఆస‌క్తితో నెల‌ల త‌ర‌బ‌డి తాను శోధించిన‌ట్లు చెప్పారు.

నిజాం కాలంలో ఆయ‌నో గొప్ప ఇంజినీర్ అన్న విష‌యం త‌న‌కు తెలిసింద‌ని చెప్పారు. ఆయ‌న భార్య క‌లెక్ట‌రేటు క్యాంపు కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేశార‌ని.. గ‌తంలో ప‌ని చేసిన క‌లెక్ట‌ర్లు ఇంటి మొద‌టి అంత‌స్తులో దెయ్యం ఉంద‌ని త‌న‌తో చెప్పిన‌ట్లుగా చెప్పారు.

దీంతో.. తాను క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత పైకి వెళ్లి చూశాన‌ని.. గ‌దంతా చింద‌ర‌వంద‌ర‌గా ఉంద‌ని.. దాంతో ఆ గ‌దిని స‌ద్ది పెట్టించాన‌న్నారు. అయిన‌ప్ప‌టికీ గ‌దిలో దెయ్యం ఉంద‌న్న భ‌యంతో అక్క‌డ ప‌డుకోవ‌టానికి సాహ‌సించ‌న‌ని చెప్పారు. ఆమె మాట‌లు ఇప్పుడు అంద‌రినోటా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఒక క‌లెక్ట‌ర్ ఇలా మాట్లాడితే చ‌ర్చ‌గా ఎందుకు మార‌వు?