Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల మధ్య వార్ షురూ

By:  Tupaki Desk   |   13 Feb 2016 6:21 AM GMT
చంద్రుళ్ల మధ్య వార్ షురూ
X
గత కొద్దికాలంగా స్నేహగీతం పాడుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కత్తులు నూరుకునే సమయం ఆసన్నమైనట్లే. రాజకీయ అధిక్యాన్ని ప్రదర్శించుకునే క్రమంలో ఎత్తుకు పై ఎత్తు వేసుకోవటం తెలిసిందే. ఆ మధ్య తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారం తెర మీదకు రావటం.. దీనికి ప్రతిగా అన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ రావటం జరిగింది.

దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అప్రకటిత వార్ లాంటిది చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు చంద్రుళ్లు తమ వ్యూహాలకు పదును పెడుతూ.. థ్రిల్లర్ సినిమాకు మించిపోయేలా ఘటనలు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పోటాపోటీగా కేసులు పెట్టుకోవటం.. నోటీసులు ఇచ్చుకోవటం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మద్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్ కి వెళ్లాయి. ఏ నిమిషాన ఏం జరుగుతుందోనన్న భావన రెండు రాష్ట్రాల ప్రజలకు కలిగిన పరిస్థితి.

ఇలాంటి సమయంలో చంద్రుళ్ల మధ్య పెద్ద స్థాయిలో జరిగిన రాజీ ప్రయత్నాలు ఒక కొలిక్కి రావటంతో.. ఎవరికి వారు ఒక అడుగు వెనక్కి వేశారు. దీంతో.. ఉద్రిక్తతలు తగ్గి సాధారణ పరిస్థితి చోటు చేసుకున్నాయి. అధినేతల మద్య కుదిరిన రాజీతో తెలంగాణలో ఓటుకు నోటు కేసు.. ఆంధ్రాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక దశ దాటి ముందుకు వెళ్లని పరిస్థితి.

ఆ తర్వాత అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పలికేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లటం.. అందుకు ప్రతిగా కేసీఆర్ అమరావతికి వెళ్లారు. అనంతరం ఇరువురి మధ్య సంబంధాలు మరింత పెరిగాయి. ఈ మధ్యనే కెసీఆర్ చేపట్టిన అయుత చండీయాగం కార్యక్రమానికి బాబును పిలిచేందుకు అమరావతి ప్రాంతంలోని ఆయన ఇంటికి వెళ్లటం.. అందుకు ప్రతిగా చంద్రబాబు చండీయాగానికి రావటం లాంటివి జరిగిపోయాయి. ఇలా ఒకరికొకరు మర్యాద ఇచ్చుకుంటూ.. స్నేహంగా ఉన్న సమయంలోనే గ్రేటర్ ఎన్నికలు జరిగాయి.

ఊహించని దాని కంటే భిన్నంగా గ్రేటర్ ఎన్నికల ఫలితాలు రావటం.. అనంతరం టీటీడీపీకి చెందిన నేతలు పలువురు అధికారపార్టీ తీర్థం పుచ్చుకున్న వేళలో టీటీడీపీ వర్గాలు రగిలిపోతుండగా.. ఊహించని విదంగా ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రావటం గమనార్హం. ఓటుకు నోటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాత్ర ఉందని.. అందుకు తగ్గ ఆధారాలు తమకు లభించాయని.. త్వరలోనే నోటీసులు ఇస్తారన్న మాట వినిపిస్తున్న సమయంలోనే.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య (ఏ 4)కు ఏసీబీ నోటీసులు ఇవ్వటంతో కలకలం రేగింది. వారంలోపు విచారణకు రావాలంటూ ఉప్పల్ లోని మత్తయ్య ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. దీంతో.. వాతావరణం ఒక్కసారి హాట్ గా మారిపోయింది. మత్తయ్య అరెస్ట్ తో పాటు..తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో టీటీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు అరెస్ట్ ముప్పు తప్పదన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో ఫోన్ ట్యాపింగ్ కేసును ఏపీ సర్కారు కదిలించక తప్పదని.. మళ్లీ చంద్రుళ్ల మధ్య వార్ షురూ అయినట్లేనని చెబుతున్నారు.