Begin typing your search above and press return to search.

ఆర్థిక సంవత్సరం మారుతుందా...?

By:  Tupaki Desk   |   28 Aug 2016 9:30 AM GMT
ఆర్థిక సంవత్సరం మారుతుందా...?
X
క్యాలండర్ సంవత్సరం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. కానీ.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుంది. క్యాలండర్ ఇయర్ - ఫైనాన్షియల్ ఇయర్ రెండూ వేర్వేరుగా ఉన్నాయి మన దేశంలో. కానీ.. కొన్ని దేశాల్లో మాత్రం ఆర్థిక సంవత్సరం కూడా జనవరి 1 నుంచే ప్రారంభమవుతుంది. మరికొన్ని దేశాల్లో జులై నుంచి - ఆగస్టు నుంచి.. ఇలా ఒక్కో దేశంలో ఒక్కో నెల నుంచి ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది. అయితే.. మన దేశంలో ఆర్థిక సంవత్సరం మార్చే ఆలోచన మొదలైంది. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలంటూ కమిటీ కూడా వేశారు. ఈ డిసెంబరులో గా కమిటీ నివేదిక ఇవ్వనుంది.

ఆర్ధిక సంవత్సరం మార్పుపై కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు సూచనలకు ఆహ్వానిస్తోంది. ప్రస్తుతమున్న ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఉన్న ఆర్ధిక సంవత్సరాన్ని ముందుకు జరిపేందుకు గానూ బడ్జెట్‌ ను కూడా దాదాపు నెలరోజుల ముందుకు జరిపేందుకు కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న మైగవ్‌.ఇన్‌ లో ప్రజల నుంచి సలహాలు సూచనలను కోరుతూ ఓ పోస్టు దర్శనమిస్తోంది. ఆర్ధిక సంవత్సరంలో మార్పులు తీసుకురావాలా వద్దా అన్నదానిపై అనుకూలంగా వ్యతిరేకంగా అనేక అభిప్రాయాలు ఉన్నాయని ఇందులో పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేకించి బడ్జెట్‌ తో పాటు ప్రభుత్వ ద్రవ్య నిర్వహణ - ప్రభుత్వ రెవెన్యూల సీజనాలిటీ - వ్యయం - బడ్జెట్‌ అంచనాలపై వర్షాల ప్రభావం - పని సీజన్‌ - పార్లమెంటు చేత బడ్జెట్‌ ఆమోదం పొందే సమయం - ఆర్ధిక సంవత్సర గణాంకాలకు అంతర్జాతీయ పోలిక - పన్ను అంచనా.. కార్పొరేట్‌ మదింపు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్ధిక సంవత్సరాన్ని సవరించడం తదితర అంశాలు ప్రధానంగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి.

కాగా ‘నూతన ఆర్ధిక సంవత్సరానికి’ గల సాధ్యాసాధ్యాలు - ప్రయోజనాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మాజీ ముఖ్య ఆర్ధిక సలహాదారు శంకర్‌ ఆచార్య నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మాజీ కేబినెట్‌ కార్యదర్శి కేఎం చంద్రశేఖర్‌ - తమిళనాడు మాజీ ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ పీవీ రాజారామన్‌ - సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ సీనియర్‌ ఫెలో డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ నిబంధనల మేరకు ప్రజలు తమ సూచనలు - సలహాలు - సమాచారం - డాక్యుమెంట్లు సమర్పించేందుకు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు గానూ వచ్చెనెల 30 వరకు గడువు ఇచ్చింది. ఇక కమిటీ మాత్రం ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. కమిటీ సిఫార్సులు - ప్రజాభిప్రాయం అన్నీ చూసుకుని ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.