ఆగమాగం చేస్తున్న ఆ డర్టీ పిక్చర్

Sun Aug 13 2017 09:53:13 GMT+0530 (IST)

తెలంగాణ అధికారపక్షంలో ఇప్పుడు డర్టీ పిక్చర్ ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. జీహెచ్ ఎంసీ కార్పొరేటర్ ఒకరు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన డర్టీ పిక్చర్ మీద ఆగమాగం అవుతోంది. ఆ పోస్టు చేసిన కార్పొరేటర్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది.ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మరీ ఇంత దిగజారుడుతనమా? అంటూ తిట్టిపోస్తున్న వారు.. పిలిపించుకొని మరీ తలంటు పోస్తున్న వారి ముచ్చట రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో.. సదరు కార్పొరేటర్ ఆగమాగం అవుతున్నారు. ఇంతకీ.. డర్టీ పిక్చర్ పోస్ట్ చేసిన ఆ కార్పొరేటర్ ఎవరు? అసలీ వ్యవహారం ఏందన్న విషయంలోకి వెళితే..

గ్రేటర్ హైదరాబాద్ లోని వెంగళరావునగర్ డివిజన్ కు కార్పొరేటర్ టీఆర్ ఎస్ కు చెందిన కిలారి మనోహర్. ఎలా జరిగిందో కానీ (ఆయన చెప్పిన దాని ప్రకారం తన మీద కోపం ఉన్న తన కారుడ్రైవర్ ఈ పాడు పని చేశాడని చెబుతున్నారు)  జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల గ్రూప్ లో  ఈ నెల ఒకటిన ఒక పోర్న్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్న వారిలో మంత్రి కేటీఆర్ తో పాటు.. ఎంపీ కవిత కూడా ఉన్నారు.

వీడియో పోస్ట్ చేసిన పదిహేను నిమిషాల వ్యవధిలో జరిగిన పొరపాటును గుర్తించారు కిలారి. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కొందరు కార్పొరేటర్లు ఈ డర్టీ పిక్చర్ ను డౌన్ లోడ్ చేసుకొని మరీ చూసి షాక్ తింటే... మరికొందరు మాత్రం ఇదేం పోయేకాలం అంటూ ఫోన్ చేసి వాయించేశారు.

డర్టీ పిక్చర్ యవ్వారం మంత్రి కేటీఆర్.. ఎంపీ కవితల దృష్టికి వెళ్లటంతో వారు తీవ్రంగా రియాక్ట్ అయి.. తలంటేశారు.

దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి చోటు చేసుకుంది. తన మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తటంతో కిలారి జరిగిన తప్పు తన కారణంగా జరగలేదని.. అదంతా తన డ్రైవర్ తన మీద ఉన్న కోపంతో చేశాడంటూ వివరణ ఇచ్చే ప్రోగ్రాం మొదలు పెట్టినా.. తోటి సభ్యుల తిట్ల దండకం మాత్రంఎంతకూ తగ్గటం లేదు.

చాలా మర్యాదగా వ్యవహరించే కిలారి ఇలా చేయటం ఏమిటన్న ఆశ్చర్యం కొందరు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇదెక్కడి బరితెగింపు అంటూ మండిపడుతున్నారు. డర్టీ పిక్చర్‌ను తన భార్య చూడలేదని ఒక కార్పొరేటర్ భర్త వ్యాఖ్యానిస్తుంటే.. మరో మహిళా కార్పొరేటర్ మాత్రం.. ఇలాంటివి కిలారి లాంటి వ్యక్తి నుంచి తాము అస్సలు ఊహించలేదని చెప్పటం గమనార్హం. ఏమైనా.. ఈ డర్టీ పిక్చర్ వ్యవహారం గులాబీ పార్టీలో పెద్ద గొడవగా మారిందని చెప్పక తప్పదు.