హైటెక్ సిటీకి దీటుగా వైజాగ్ ఫింటెక్ వ్యాలీ

Thu Oct 19 2017 17:45:00 GMT+0530 (IST)

నవ్యాంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతితోపాటు అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోన్న సంగతి తెలిసిందే. తీరప్రాంతమైన విశాఖపట్నాన్ని టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ దిశగా ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థలను విశాఖలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించింది. బ్లాక్‌చైన్ -  సైబర్ సెక్యూరిటీ - డేటా ఎనాలసిస్ - ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి సరికొత్త టెక్నాలజీలకు సంబంధించిన సంస్థలను  వైజాగ్ ఫిన్ టెక్ వ్యాలీలో ప్రారంభించేందుకు జాతీయ అంతర్జాతీయ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. విభజనానంతరం ఐటీ రంగానికి కేంద్రమైన హైదరాబాద్ ను సీమాంధ్ర వాసులు కోల్పోయారు. దీంతో వైజాగ్ ను హైదరాబాద్ కు దీటుగా ఐటీ హబ్ గా తీర్చి దిద్దాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 1995-2004 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా పనిచేసిన చంద్రబాబునాయుడు హైదరాబాద్ ను ఐటీ ప్రపంచపటంలో నిలిపేందుకు చాలా కృషి చేశారు. హైటెక్ సిటీని ఏర్పాటు చేశారు. అదే విధంగా భవిష్యత్తులో వైజాగ్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సరికొత్త టెక్నాలజీలపై ఆయన దృష్టి పెడుతున్నారు.అక్టోబర్ నాటికి ఫింటెక్ వ్యాలీ స్థాపించి సంవత్సరం పూర్తయింది. ఈ నెలలో 9 ఫింటెక్ కంపెనీలను ఫింటెక్ వ్యాలీ ఆకర్షించింది. ఈ నెలలో నిర్వహించిన బ్లాక్‌చైన్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో - ఐసీఐసీఐ - మహీంద్రా ఫైనాన్స్ ఫింటెక్ వ్యాలీలో రెండు యాక్సిలరేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు  ప్రకటించాయి. టాటా కాపిటల్ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - హెచ్ డిఎఫ్‌సి - మరికొందరు త్వరలో తమ యాక్సిలరేటర్లను ప్రారంభిస్తారు. బ్రాడ్డ్జ్జ్ కాపిటల్ మరియు థామ్సన్ రాయిటర్స్ లు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయనున్నాయి. కండ్యూయెంట్ సంస్థ రాబోయే మూడేళ్లలో 649 కోట్ల రూపాయల పెట్టుబడులతో వైజాగ్ లో 5 వేల ఉద్యోగావకాశాలు కల్పించేందుకు యోచిస్తోంది. ఫింటెక్ వ్యాలీలో 2000 ఉద్యోగాలతో పాటు -  వైజాగ్ లో ఒక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ ఎస్ ఈ) ఒక డేటా సెంటర్ ను  ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సింగపూర్ మానిటరీ అథారిటీ (MAS) కూడా త్వరలో యాక్సిలరేటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పరిపాలనలో కొత్త టెక్నాలజీని ఉపయోగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) వంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సిలికాన్ వ్యాలీ మరియు బెంగుళూరు తరహాలోనే తాము వైజాగ్ ను డెవలప్ చేస్తామని సమాచార సాంకేతిక సలహాదారు జే ఏ చౌదరి చెప్పారు. కొత్త టెక్నాలజీకి అవసరమైన మానవ వనరులను సృష్టించేందుకు తిరుపతిలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ (ఐఐడిటి) ను ఏర్పాటు చేశారు. సరికొత్త సాంకేతికతలపై యువతకు అవగాహన కలిగించేందుకు ప్రతి నెలా హ్యాకహాన్లు - సెమినార్లు మరియు వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తున్నాయి. తాము  పౌరులకు విస్తృతంగా సేవలను అందించడానికి ఐటీని ఉపయోగిస్తున్నామని అందువల్ల ఐటీ ఆస్తులను కాపాడుకోవడానికి బ్లాక్‌చైన్ టెక్నాలజీ అవసరమని ఐటీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. రూ. 500 కోట్ల ఫింటెక్ ఫండ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. వైజాగ్ లో ఐటీ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించడం అంత సులువు కాదని లోకేష్ అన్నారు. వైజాగ్ లో మరిన్ని హోటళ్లు - ఎయిర్ లైన్ సర్వీసులు - ఇతర సాంఘిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. వైజాగ్ లో విద్యా - హోటల్ - ఎయిర్ లైన్స్ రంగాలలో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు తప్పక వస్తాయని లోకేష్ అభిప్రాయపడ్డారు.