Begin typing your search above and press return to search.

వివేక్ కళ్లు తిరిగి పడిపోయాడా?

By:  Tupaki Desk   |   26 Nov 2015 8:43 AM GMT
వివేక్ కళ్లు తిరిగి పడిపోయాడా?
X
వరంగల్ ఉప ఎన్నిక ఫలితం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వివేక్ కళ్లు తిరిగి కింద పడిపోయాడా? నోటివరకూ వచ్చిన అవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్నానని తీవ్రంగా బాధ పడ్డాడా? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు.

వాస్తవానికి వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా వివేక్ ను దించాలని తెలంగాణ రాష్ట్ర సమితి భావించిన విషయం తెలిసిందే. అందుకు హరీశ్ రావు రాయబారం కూడా నడిపారు. అయితే, టీఆర్ ఎస్ లోకి మళ్లీ వచ్చి, ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆయన విముఖత వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి సోనియా గాంధీ స్థాయిలో అధిష్ఠానం కూడా ఆయనతో మాట్లాడింది. కానీ, బరిలోకి దిగడానికి ఆయన ససేమిరా అన్నారు. ఆయన ససేమిరా అన్న తర్వాతే టీఆర్ ఎస్ పసునూరి దయాకర్ ను రంగంలోకి దించితే.. కాంగ్రెస్ రాజయ్యకు ఆ తర్వాత సర్వేకు అవకాశం ఇచ్చింది.

ఒకవేళ టీఆర్ ఎస్ తరఫున వివేక్ అభ్యర్థి అయి ఉంటే వరంగల్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ మెజారిటీ ఆరు లక్షలు దాటేసి ఉండేదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలోనే అత్యధిక మెజారిటీ ఆయనకు వచ్చినా ఆశ్చర్యం ఉండేది కాదని, ఉప ఎన్నిక ఫలితం తర్వాత పరిస్థితి అదేనని అంటున్నారు. దానికితోడు దయాకర్ కంటే కూడా ఆయన డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోగలిగేవాడని కూడా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ ఫలితం తెలిసిన వెంటనే వివేక్ కు కళ్లు బైర్లు కమ్మాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఉంటే గట్టి పోటీ ఇచ్చేవాడని చెబుతున్నారు. అయితే, వరంగల్ ఉప ఎన్నికల్లో స్థానికత కారణంగానే సర్వేను - దేవయ్యను ఓటర్లు తిరస్కరించారని, టీఆర్ ఎస్ తరఫున వివేక్ ను బరిలోకి దింపితే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేమని కూడా మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.