లోకేశ్ కు బీజేపీ ఎమ్మెల్యే కౌంటర్

Wed Sep 13 2017 23:00:01 GMT+0530 (IST)

ఏపీ మంత్రి నారా లోకేశ్ కు మిత్రపక్షం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డైరెక్ట్ కౌంటర్ వేశారు. నియోజకవర్గాల పెంపు లేనట్లేనని లోకేశ్ తన మాటల్లో క్లారిటీ ఇచ్చేశారని... అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ సొంతంగా పోటీ చేస్తుందా లేదంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా అన్న విషయంలో క్లారిటీ ఇవ్వాలని ఆయన అన్నారు.
    
ఏపీలో బలపడాలని టీడీపీ కోరుకుంటున్నట్లే బీజేపీ కూడా తమ పార్టీ బలపడాలని కోరుకుంటోందని ఆయన అన్నారు.  బీజేపీ కూడా రాష్ట్రంలోని 175 స్థానాల్లో బలపడాలని కోరుకుంటోందని రాష్ట్రంలోనూ తమ పార్టీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తామని కూడా కుండబద్దలు కొట్టారు.
    
ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తామని టీడీపీ చెప్పడం ద్వారా అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగడం లేదనే విషయం లోకేశ్ క్లారిటీ ఇచ్చారని ఆయన అన్నారు. కాగా విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏమాత్రం అవకాశం దొరికినా టీడీపీని విమర్శించడంలో వెనకాడడం లేదు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలని తమ పార్టీ పెద్దల వద్ద గట్టిగా పట్టుపడుతున్న బీజేపీ నేతల్లో ఆయన కూడా ఒకరని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.