Begin typing your search above and press return to search.

వైకాపా హీరో కాదు జీరో అవుతుంది: బీజేపీ

By:  Tupaki Desk   |   1 Sep 2015 5:41 AM GMT
వైకాపా హీరో కాదు జీరో అవుతుంది: బీజేపీ
X
త‌ల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్ అని అంద‌రు విమ‌ర్శిస్తుంటే తాను పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని..కాని అసెంబ్లీలో వైకాపా నాయ‌కుల చేష్ట‌లు చూస్తుంటే ఆ మాట నూటికి నూరుపాళ్లు క‌ర‌క్టే అనిపిస్తోంద‌ని బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు వైకాపా తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మంగ‌ళ‌వారం రెండో రోజు శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభ‌మైన వెంట‌నే వైకాపా స‌భ్యులు ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ శాస‌న‌స‌భ‌ను అడ్డుకున్నారు. స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు ప‌లుమార్లు క్వ‌శ్చ‌న్ అవ‌ర్ త‌ర్వాత ప్ర‌త్యేక హోదా విష‌యంపై చర్చిద్దామ‌ని సూచించినా వారు మాత్రం ప‌ట్టువిడ‌కుండా త‌మ నిర‌స‌న కొన‌సాగించారు. దీంతో స్పీక‌ర్ అసెంబ్లీని వాయిదా వేశారు.

ముందుగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ వైకాపా స‌భ స‌జావుగా జ‌రిగేందుకు స‌హ‌క‌రిస్తే ప్ర‌త్యేక హోదాపై అర్థ‌వంత‌మైన చ‌ర్చ జ‌రుగుతుంద‌న్నారు. అలాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అన్ని విషయాలపై చర్చిస్తోందని ఆయన అన్నారు. శాస‌న‌స‌భ‌ను అడ్డుకుని వైకాపా నాయ‌కులు హీరోల‌వుదామ‌నుకుంటున్నార‌ని..కాని వారు మాత్రం జీరోల‌వుతార‌ని విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. స్పీక‌ర్ నిర్దాక్షిణ్యంగా వైకాపా నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాట్లాడుతూ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం అయ్యాక చంద్రబాబు ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌క‌ట‌న చేస్తార‌ని..త‌ర్వాత జ‌గ‌న్ కూడా దీనిపై చ‌ర్చించ‌వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు. జ‌గ‌న్‌కు ఇప్ప‌ట‌కీ పార్ల‌మెంట‌రీ లాంగ్వేజ్ తెలియ‌డం లేద‌ని..అవాకులు, చ‌వాకులు అనే ప‌దం శాస‌న‌స‌భ నియ‌మాల‌కు విరుద్ధ‌మ‌ని..శాస‌న‌స‌భ‌లో వైకాపా రాజ్యాంగ విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.