Begin typing your search above and press return to search.

ఆ బీజేపీ నేత మ‌ళ్లీ బాబును కెలికాడుగా

By:  Tupaki Desk   |   16 Oct 2017 2:28 PM GMT
ఆ బీజేపీ నేత మ‌ళ్లీ బాబును కెలికాడుగా
X
మిత్ర‌ప‌క్షపార్టీ ..అందులోనూ శాస‌న‌స‌భాప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్ప‌టికీ...త‌ప్పును త‌ప్పుగా... ప్పును ఒప్పుగా ఎత్తిచూపించ‌డంతో పాటుగా తమ పార్టీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఎలాంటి భేష‌జాలు లేకుండా పాలక‌ప‌క్షాన్ని నిల‌దీసే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు...మ‌రోమారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తీరును త‌ప్పుప‌ట్టారు. గ‌తంలో అమరావ‌తి భూసేక‌ర‌ణ, విశాఖ భూకుంభ‌కోణంపై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేసి టీడీపీ స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసిన విష్ణు తాజాగా తెలుగుదేశం పార్టీ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం ప‌నితీరును త‌ప్పుప‌ట్టారు.

కేంద్రం నిధులు ఇచ్చే విష‌యంలో జాప్యం జ‌రిగితే విమ‌ర్శిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం...సంక్షేమ పథకాలకు మంజూరు చేసిన నిధుల విష‌యంలో మాత్రం ఆ పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొమ్ము కేంద్ర ప్ర‌భుత్వానిది...ప్ర‌చారం ఏపీ ప్ర‌భుత్వానికి అని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం అని ప్ర‌చారం చేసుకుంటున్న చంద్ర‌న్న బీమ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న పలు పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని, వాటికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తమ పేర్లు పెట్టుకుంటుందని పేర్కొంటూ ఇదే విష‌యాన్ని తాను నిల‌దీయ‌డంతో ఇటీవ‌ల పేరు మారుస్తూ...చంద్ర‌న్న బీమాలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పేరు చేర్చార‌ని విష్ణుకుమార్‌ రాజు వివ‌రించారు.

గ‌త కొంత‌కాలంగా టీడీపీ ప్ర‌చారం, ఆ పార్టీ కార్య‌క్ర‌మాల‌పై విష్ణుకుమార్ రాజు సంద‌ర్భానుసారం అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. ఇటీవ‌ల టీడీపీ చేప‌ట్టిన ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మ‌మైన ఇంటింటికీ తెలుగుదేశం సాగుతున్న తీరును త‌ప్పుప‌ట్టారు. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో మంత్రులు సచివాలయానికి రావడం లేదని, దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని విష్ణుకుమార్ విమర్శించారు. రకరకాల సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తున్నార‌ని తీరా మంత్రులు లేక‌పోవ‌డంతో నిరాశ‌కు గుర‌వుతున్నార‌ని అన్నారు. తాను కూడా వినతి పత్రాలు ఇద్దామంటే ఇక్కడ మంత్రులు లేరని అన్నారు. తాను మంత్రులను కలుద్దామని వచ్చి నిరుత్సాహపడ్డానని అన్నారు. సచివాలయంలో మంత్రులు ఉండకపోతే ప్రజల వినతులు ఎవరు తీసుకుంటారని విష్ణుకుమార్ రాజు సూటిగా ప్రశ్నించారు. అంత‌కుముందు ఓ సంద‌ర్భంలో మీడియాలో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ఏ విధంగా అయితే బలపడాలని అనుకుంటుందో.. బీజేపీ కూడా ఆ విధంగానే బలపడాలని అనుకుంటుందని అన్నారు.