Begin typing your search above and press return to search.

విశాఖ బాధ.. ఇంతింత కాదయా..

By:  Tupaki Desk   |   23 March 2019 5:30 PM GMT
విశాఖ బాధ.. ఇంతింత కాదయా..
X
విశాఖ చేసిన పుణ్యమో.. లేక పాపమో కానీ.. విశాఖ నెత్తిన ఇప్పుడు నాన్ లోకల్స్ కూర్చుంటున్నారు. 25 లక్షల జనాభా ఉన్న విశాఖ పార్లమెంట్ లో కనీసం ఎంపీగా పోటీచేయడానికి ఒక్క లోకల్ అభ్యర్థి కూడా పార్టీలకు దొరకకపోవడం విస్మయం కలిగిస్తోంది.

విశాఖ పార్లమెంట్ సీటు.. ఇప్పుడు అన్ని పార్టీలకు బంగారు బాతుగా మారింది. ఎందుకంటే ఇక్కడ పోటీచేయడానికి పార్టీలన్నీ ఎక్కడి నుంచో నాయకులను అరువు తెచ్చుకుంటాయి. మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఇదే తంతు. విశాఖ ఎంపీ సీటు అంటే నాన్ లోకల్ అన్న ముద్ర పడిపోయింది. ప్రజలు కూడా దిక్కు లేకుండా వారినే గెలిపించాల్సిన పరిస్థితిని ప్రధాన పార్టీలు కల్పిస్తున్నాయి. దీంతో స్థానిక నేతలు - ప్రజల్లో ఒకింత ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాము నాయకులుగా పనికి రామా అంటూ వారు వాపోతున్నారు.

తాజాగా విశాఖ ఎంపీ సీటులో టీడీపీ - జనసేన - బీజేపీలు నాన్ లోకల్ అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ నుంచి గోదావరి జిల్లాలకు చెందిన బాలయ్య అల్లుడు భరత్ - జనసేన నుంచి రాయలసీమకు చెందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ - బీజేపీ నుంచి ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరిని బరిలో దించారు. ఈ ముగ్గురు విశాఖకు చెందిన వారు కాదు. నాన్ లోకల్స్..

ఇలా విశాఖకు బయట నుంచి నాయకులను తీసుకొచ్చి ప్రధాన పార్టీలు అభ్యర్థులుగా నిలపడం.. జనాలు ఆప్షన్ లేక గెలిపించడం జరిగిపోతోంది. లోకేల్ మేనియా - ఫ్లేవర్ లేని ఈ నేతలు వారి సొంత ఊరు లేదా హైదరాబాద్ టు ఢిల్లీ పయనమవుతూ విశాఖను గాలికి వదిలేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఈ నాన్ లోకల్ నేతల బాధ తమకు తప్పించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.