Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్!...విశాఖ బ‌రిలో విన్న‌ర్ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   21 March 2019 4:26 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్!...విశాఖ బ‌రిలో విన్న‌ర్ ఎవ‌రు?
X
అభ్య‌ర్థులు:

టీడీపీ:.. భ‌ర‌త్‌
వైసీపీ: ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌
జ‌న‌సేన‌: వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌
బీజేపీ: ఖ‌రారు కాలేదు

మొత్తం ఓట‌ర్ల సంఖ్య‌: 17, 23,011

అసెంబ్లీ సెగ్మెంట్స్‌(7): శృంగ‌వ‌ర‌పు కోట‌ - భీమిలి - గాజువాక‌ - విశాఖ ఉత్త‌ర‌ - విశాఖ ద‌క్షిణ‌ - విశాఖ తూర్పు- విశాఖ ప‌శ్చిమ‌

ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎంపీ: క‌ంభంపాటి హ‌రిబాబు (బీజేపీ)

విశాఖప‌ట్నం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం... ఏ ఎన్నిక‌ల్లో అయినా ప్ర‌త్యేక‌మే. ఎందుకంటే... ఉన్న‌త విద్యావంతుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త తీర్పులు వెలువ‌డుతూ ఉంటాయి. చూడ్డానికి సాదాసీదా బ‌రిగానే క‌నిపించే విశాఖ పార్ల‌మెంటు ఎన్నిక‌లు మాత్రం ఎప్ప‌టికప్పుడు కొత్త సంగ‌తుల‌ను నేర్పిస్తూనే ఉంటాయి. పెద్ద‌గా సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ కాని ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయా పార్టీల బ‌లాబ‌లాలు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూనే ఉంటాయి. అతి స్వ‌ల్పంగా క‌నిపించే లోక‌ల్ సెంటిమెంట్ కూడా అప్పుడ‌ప్పుడు ఇక్క‌డి ఫ‌లితాన్ని ప్ర‌భావితం చేసింద‌న్న విశ్లేష‌ణ‌లూ ఉన్నాయి. ఆయా పార్టీలు రంగంలోకి దించుతున్న‌ అభ్య‌ర్థుల‌ను బ‌ట్టి కొన్ని సార్లు మారితే... ఆయా సమ‌యాల్లో నెల‌కొన్న ప‌రిస్థితులు కొన్ని సార్లు - ప్ర‌ధాన పార్టీల స్టామినా - గెలుపు అవ‌కాశాలు మ‌రికొన్ని సార్లు ఫ‌లితాల‌ను ప్ర‌భావితం చేసిన దాఖ‌లాలు ఉన్నాయ‌నే చెప్పాలి. అంటే... ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలో దాదాపుగా అన్ని ర‌కాల ఈక్వేష‌న్ల‌తో ఆలోచించుకుని మ‌రీ ఓటు వేసే విశాఖ వాసులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ తీర్పు కొత్త‌గానే ఉండేలా చూసుకుంటార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. మొత్తంగా ఏ ఎన్నిక‌ల్లో కూడా ఇక్క‌డ గెలుపు ఎవ‌రిద‌న్న విష‌యాన్ని అంచ‌నా వేయ‌డం అంత ఈజీ కాద‌న్న భావ‌న కూడా లేక‌పోలేదు.

మ‌రి మ‌రో 20 రోజుల్లో జ‌ర‌గ‌నున్న తాజా ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిద‌న్న విష‌యంపై కూడా విశాఖ వాసుల ప‌ల్స్ స‌ర్వేల‌కు ఏమాత్రం అంద‌డం లేదు. అందుకు గ‌ల కార‌ణాలు ఏమిట‌న్న విష‌యాన్ని కాస్తంత లోతుగా ప‌రిశీలిస్తే... ఇక్క‌డ అధికార టీడీపీ త‌ర‌ఫున దివంగ‌త మాజీ ఎంపీ - సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త ఎంవీవీఎస్ మూర్తి రాజ‌కీయ వార‌సుడిగా ప్ర‌చారంలోకి వ‌చ్చిన భ‌ర‌త్ బ‌రిలోకి దిగేశారు. మూర్తి మ‌న‌వ‌డిగానే కాకుండా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కుటుంబానికి కాస్తంత ద‌గ్గ‌ర బంధువుగానే కాకుండా చంద్ర‌బాబు వియ్యంకుడు - హిందూపురం ఎమ్మెల్యే - సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అల్లుడిగానూ జ‌నాల‌కు బాగానే ప‌రిచ‌యం ఉన్న భ‌ర‌త్‌... గెలుపుపై మాత్రం ధీమాగానే ఉన్నారు. ఇక విప‌క్ష వైసీపీ నుంచి ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ముళ్ల‌పూడి వీర‌వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ (ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌) బ‌రిలోకి దిగారు. చాలా కాలం క్రిత‌మే వైసీపీలో చేరిన ఆయ‌న‌కు ఆ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన హామీ మేర‌కు ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు విశాఖ ఎంపీ సీటు కేటాయించారు. స్థానికంగా మంచి పేరుతో పాటు ఎంత‌టి బల‌మైన అభ్య‌ర్థిని అయినా ఢీకొట్ట‌గ‌లిగే సామ‌ర్థ్యం ఉన్న దృష్ట్యా స‌త్యానారాయ‌ణ‌పై వైసీపీకి మంచి అంచ‌నాలే ఉన్నాయ‌ని చెప్పాలి. సినీ నేప‌థ్యంతో పాటు పారిశ్రామికంగానూ మంచి పేరు సంపాదించిన స‌త్య‌నారాయ‌ణ‌... ఇక్క‌డ టీడీపీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం ఖాయ‌మేనన్న వాద‌న కూడా లేక‌పోలేదు.

ఇక చివ‌ర‌గా ఈ స్థానం నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఇటీవ‌లే త‌మ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి - సీబీఐ మాజీ జేడీగానే అందరికీ చిర‌ప‌ర‌చితులైన వీవీ ల‌క్ష్మీనారాయ‌ణను రంగంలోకి దించేశారు. ఇటీవ‌లే పార్టీలో చేరిన ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఉన్న ఇమేజీని బాగానే వాడుకునేందుకే సిద్ధ‌మైపోయిన ప‌వ‌న్‌... ల‌క్ష్మీనారాయ‌ణ విశాఖ నుంచి పోటీ చేస్తే... ఆయ‌న ఇమేజీతో మ‌రిన్ని స్థానాల్లో త‌మ‌కు మ‌రింత మేర మంచి జ‌రుగుతుంద‌న్న‌ది ప‌వ‌న్ భావ‌న‌గా చెబుతున్నారు. ఇక ఇక్క‌డ సిట్టింగ్ ఎంపీగా ప్ర‌స్తుతం బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత కంభంపాటి హ‌రిబాబు ఉన్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీ క‌లిసి పోటీ చేయ‌గా... ఈ సీటు బీజేపీకి ద‌క్క‌గా - ఇటు బీజేపీకి ఉన్న కొద్దిపాటి ఓటింగ్ తో పాటు టీడీపీ ఓట్లు - జ‌న‌సేన ప్ర‌చారం వ‌ల్ల క‌లిసి వ‌చ్చిన ఓట్ల‌తో ఆయ‌న... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ‌ను కూడా ఓడించేశారు. హ‌రిబాబు.. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారో? లేదో? ఇప్ప‌టిదాకా స్ప‌ష్ట‌త లేదు. హ‌రిబాబు నుంచే కాకుండా అస‌లు బీజేపీ త‌న అభ్య‌ర్థిని ఇక్క‌డి నుంచి బ‌రిలోకి దింపుతుందో - లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. అయితే గ‌డ‌చిన రెండు రోజులుగా ఇక్క‌డి నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా ఆ పార్టీ మ‌హిళా విభాగం మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు - కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి బ‌రిలోకి దిగ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. స్ప‌ష్ట‌త లేని బీజేపీని ప‌క్క‌న‌పెడితే.... ఇక్క‌డి పోటీ త్రిముఖ‌మేన‌ని చెప్పాలి. టీడీపీ - వైసీపీ - జ‌న‌సేన‌ల మ‌ధ్య జ‌రిగే ఈ పోటీలో ఎవ‌రికి ఎడ్జ్ ద‌క్కుతుంద‌న్న‌ది తేలాల్సి ఉంది.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ప‌రిస్థితిని ఓ సారి ప‌రిశీలిస్తే.. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో గాలి మొత్తం వైసీపీ వైపే వీచినా... చివ‌రిలో టీడీపీ దానికి త‌న‌వైపున‌కు తిప్పేసుకుంది. అంతేకాకుండా త‌న ఓటింగ్ కు బీజేపీ - జ‌న‌సేన ఓటింగ్ ను క‌లుపుకుని ముందుకు సాగిన టీడీపీ విజ‌య కేతనం ఎగుర‌వేసింది. ఈ క్ర‌మంలో విశాఖ పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ మూడు పార్టీల త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన కంభంపాటి హ‌రిబాబు ఈజీగానే గెలిచారు. అయితే అంచ‌నా వేయ‌డంలో కాస్తంత తిక‌మ‌క ప‌డ్డ వైసీపీ... ఏకంగా త‌న అభ్య‌ర్థిగా గౌరవాధ్య‌క్షురాలి హోదాలో ఉన్న విజ‌య‌మ్మ‌ను బ‌రిలోకి దించింది. స్థానికేత‌రురాలు అని వైరివ‌ర్గం ప్ర‌చారం చేసినా... విజ‌య‌మ్మ‌కు ఏకంగా 4,76,344 ఓట్లు ప‌డ్డాయి. ఇక మూడు పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థి అయిన కంభంపాటికి 5,66,832 ఓట్లు వ‌చ్చాయి. ఈ ఫ‌లితంతో వైసీపీకి షాక్ త‌గ‌ల‌గా... స్వ‌ల్ప తేడాతో చాలా స్థానాల‌ను చేజిక్కించుకున్న టీడీపీ ఏకంగా రాష్ట్రంలో అధికారం చేప‌ట్టేసింది.

ఇక ప్ర‌స్తుత ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే... టీడీపీ త‌న అభ్య‌ర్థిగా భ‌ర‌త్ ను ప్ర‌క‌టించేందుకు చాలా రోజుల పాటు త‌ట‌ప‌టాయించింది. పార్టీలోకి కొణ‌తాల రామ‌కృష్ణ లాంటి సీనియ‌ర్లు చేరితే ఈ స్థానానికి ప‌రిశీలించ‌వ‌చ్చ‌న్న కోణంలో చాలా రోజుల పాటే వేచి చూసిన చంద్ర‌బాబు... అటు అభ్య‌ర్థి దొర‌క్క‌పోవ‌డం - ఇటు బామ్మ‌ర్ది బాల‌య్య ఒత్తిడి నేప‌థ్యంలో భ‌ర‌త్ పేరును ఎట్ట‌కేల‌కు ప్ర‌క‌టించేశారు. అయితే ఇక్క‌డి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డంలో విప‌క్ష వైసీపీ త‌న‌దైన దూకుడుతో పాటు విస్ప‌ష్ట‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. చాలా రోజుల నుంచి చెబుతున్న‌ట్లుగానే ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కు త‌న టికెట్ ఇచ్చేసింది. అంటే... అధికార పార్టీ టీడీపీ కంటే కూడా ఈ సీటుపై విప‌క్ష వైసీపీనే స్ప‌ష్ట‌త‌తో ముందుకెళ్లింద‌న్న మాట‌. ఇక జ‌న‌సేన వైఖ‌రి కూడా చివ‌రి నిమిషం దాకా అస్ప‌ష్ట‌త‌తోనే ఉంద‌ని చెప్పాలి. విడ‌త‌ల‌వారీగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌చ్చిన జ‌న‌సేన‌... వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీలో చేర‌కుంటే.. అస‌లు విశాఖ స్థానంలో బ‌రిలోకి దిగేదే కాద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. అయితే ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేన‌లో చేరిపోవ‌డం - ఆ మ‌రుమాడే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయ‌న‌కు విశాఖ ఎంపీ సీటు ఇచ్చేయ‌డం జ‌రిగిపోయాయి. ఈ ముగ్గురి మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మైన నేప‌థ్యంలో ఎవ‌రి బ‌లాలు ఏవి? బ‌ల‌హీన‌త‌లు ఏవి? అన్న విషయం కూడా చూద్దాం.

టీడీపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ బలాలు

# స్థానికుడు
# ఎంవీవీఎస్ మూర్తి రాజ‌కీయ వార‌సుడిగా సానుకూల‌త‌
# ఉర‌క‌లెత్తే యువ‌కుడ‌న్న భావ‌న‌
# ఉన్న‌త విద్యావంతుడు

బ‌ల‌హీన‌త‌లు

# పార్టీకి న‌మ్మ‌కం క‌లిగించ‌లేక‌పోవ‌డం
# చివ‌రి దాకా టికెట్ పై ఇత‌రుల పేర్లు వినిపించ‌డం
# రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న లేమి
# బాల‌య్య‌ - లోకేశ్ లతో క‌లిపి చూడ‌టం

వైసీపీ అభ్య‌ర్థి ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ బ‌లాలు

# స్థానికుడు
# ఉన్న‌త విద్యావంతుడు - పెద్ద పారిశ్రామిక‌వేత్త‌
# పార్టీలో త‌న‌పై న‌మ్మ‌కం
# గెలిస్తే... స్థానికులకు అండ‌గా ఉంటాడ‌న్న భావ‌న‌

బ‌ల‌హీన‌త‌లు
# పెద్ద‌గా రాజ‌కీయ అనుభవం లేని ప‌రిస్థితి
# గెలిచినా... బిజినెస్ ల‌కే అధిక ప్రాధాన్యం ఇస్తార‌న్న అనుమానం

జ‌న‌సేన అభ్య‌ర్థి వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ బ‌లాలు

# స‌మ‌ర్థవంత‌మైన పోలీసు అధికారిగా పేరు
# స‌మాజంపై విస్తృత అవ‌గాహ‌న ఉంద‌న్న భావ‌న‌
# గ్రామ సీమ‌ల‌పై చేసిన అధ్య‌య‌నం

బ‌లహీన‌త‌లు

# చివ‌రి నిమిషంలో జ‌న‌సేన‌లో చేర‌డం
# సొంతంగా పార్టీ పెడ‌తానంటూ ఎన్నికన‌గానే ఆగ‌లేక‌పోయిన‌ట్టుగా జ‌న‌సేన‌లో ఎంట్రీ
# ఇచ్చిన మాట‌పై నిల‌బ‌డ‌తార‌న్న నిల‌బ‌డే ఛాన్సే లేద‌న్న అనుమానం

ఇలా మూడు పార్టీల అభ్య‌ర్థుల‌కు కొన్ని ప్ల‌స్‌ ల‌తో పాటుఎ మ‌రికొన్ని మైన‌స్‌ లూ ఉన్నాయి. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితితో ఇప్ప‌టి ప‌రిస్థితిని కాస్తంత పోల్చి చూస్తే.. జ‌న‌సేన‌ - బీజేపీల ఓటింగ్ చీల‌డంతో భ‌ర‌త్ వెనుక‌బ‌డే అవ‌కాశం లేక‌పోలేదు. ఈ ప‌రిస్థితి చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్న నేప‌థ్యంలో... స్థానికుడిగానే బ‌రిలోకి దిగుతున్న వైసీపీ అభ్య‌ర్థి ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కే కాస్తంత విజ‌యావ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎన్ని అంచ‌నాలు ఎలా ఉన్నా... అంతిమంగా పోలింగ్ రోజున ఓట‌ర్లు ఎవ‌రికి ఓటేస్తార‌న్న విష‌య‌మే ఫైన‌ల్ రిజ‌ల్ట్‌ ను తేల్చేస్తుంద‌ని చెప్పాలి.