Begin typing your search above and press return to search.

గులాబీ రాజ్యంలో కొత్త వైర‌స్‌.. భ‌యమ‌ట‌

By:  Tupaki Desk   |   16 Oct 2018 5:50 AM GMT
గులాబీ రాజ్యంలో కొత్త వైర‌స్‌.. భ‌యమ‌ట‌
X
కేసీఆర్ టైం బాగోలేదా? వ‌రుస పెట్టిన‌ట్లుగా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఎదుర‌వుతున్న ఉదంతాలు గులాబీ శ్రేణుల్లో కొత్త భ‌యాన్ని రేకెత్తిస్తున్నాయి. స‌మ‌ర‌మే కానీ సందేహం లేని గులాబీ ద‌ళాల్లో నాలుగున్న‌రేళ్ల కేసీఆర్ పాల‌న త‌ర్వాత ఎదుర‌వుతున్న కొత్త క్వ‌శ్చ‌న్ల‌కు ఆన్స‌ర్లు చెప్ప‌లేక నీళ్లు న‌ములుతున్న ప‌రిస్థితి. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ప‌రిస్థితిని పార్టీ ఎదుర్కొన్న‌ది లేద‌ని చెబుతున్నారు.

ఏమైనా స‌రే.. దూసుకెళ్ల‌టం.. త‌మ దూకుడుతో ప్ర‌త్య‌ర్థుల్ని తొక్కేయ‌ట‌మే త‌ప్పించి.. తొక్కుదామా? లేదా? అన్న ఆలోచ‌న అణుమాత్రం ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు గులాబీ వ‌నంలో కొత్త తెగులు ప‌ట్టింద‌న్న సందేహం క‌లుగిలా తాజా ప‌రిణామాలు చెప్పేస్తున్నారు. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో భ‌యం అన్న‌ది గులాబీ శ్రేణుల క‌ళ్లల్లో క‌నిపిస్తోంది. ఎప్పుడూ ఎఫెన్సే కానీ.. డిఫెన్స్ అన్న‌ది లేని కేసీఆర్ ద‌ళానికి ఇప్పుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి వెళ్లిపోయి పోరాడుతున్న వైనం స‌రికొత్త‌గా క‌నిపిస్తోంది.

పుష్క‌రానికి పైనే సాగిన ఉద్య‌మంలో ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా.. మ‌రెన్ని వెన్నుపోట్లు విరుచుకుప‌డినా స‌డ‌ల‌ని ప‌ట్టు.. నాలుగున్న‌రేళ్ల పాల‌న త‌ర్వాత‌.. తాజా తీర్పు కోసం తెర మీద‌కు వ‌చ్చిన నాడు రావ‌టం దేనికి సంకేతం? అంతేనా.. మాటల మాంత్రికుడిగా.. త‌న మాట‌ల‌తో రాత్రికి రాత్రి సీన్ మార్చేసే శ‌క్తి ఉన్న కేసీఆర్ నోట వెంట వ‌చ్చే మాట‌లతో ఆయ‌న అడ్డంగా దొరికిపోవ‌ట‌మా? నో.. నెవ్వ‌ర్ అనేటోళ్లు. కానీ.. ఇప్పుడు అంత కాన్ఫిడెంట్ గా అనలేని ప‌రిస్థితి. ఎందుకిలా అంటే.. అంత‌రాల్లో నిండుగా ఉన్న భ‌యాందోళ‌న‌లే అన్న మాట వినిపిస్తోంది.

పైకి బింకంగా.. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డుతున్నా.. లోలోప‌ల మాత్రం ఏదో తెలియ‌ని సంశ‌యం.. త‌మ‌కిచ్చిన నాలుగున్న‌రేళ్ల కాలాన్ని వృధా చేశామ‌న్న భావ‌న కావొచ్చు.. తొంద‌ర‌ప‌డి ముంద‌స్తుకు వెళ్లామ‌న్న కొత్త ఆలోచ‌న కావొచ్చు.. కార‌ణం ఏదైనా గులాబీ రాజ్యంలోకి భ‌య‌మ‌నే కొత్త వైర‌స్ ఎంట్రీ ఇచ్చింద‌ని చెప్పాలి. లేకుంటే.. కేసీఆర్ ను ఉద్దేశించి నాలుగు వ్య‌తిరేక మాట‌ల్ని మాట్లాడేందుకు వ‌ణికే గులాబీ నేత‌లు ఇప్పుడు అందుకు భిన్నంగా అంద‌రి ఎదుట‌.. కెమేరా కంటి ఎదుట నానా మాట‌లు అంటూ.. గులాబీ కండువాల్ని తీసి పారేయ‌టం.. మ‌ళ్లీ గులాబీ కారు ఎక్కే ప‌రిస్థితే లేద‌ని తేల్చేయ‌టం ఒక ఎత్తు అయితే.. ఉన్న నేత‌ల్లో చాలామంది క‌డుపులో కోపాన్ని దాచుకొని ముఖాన ప్లాస్టిక్ న‌వ్వులు పూయిస్తూ.. గులాబీ సామ్రాజ్యం ప‌చ్చ‌గా ఉంద‌న్న బిల్డ‌ప్ ఇవ్వ‌టం చూస్తేనే.. ఆ పార్టీలో వ‌చ్చిన తేడా కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.