Begin typing your search above and press return to search.

కోహ్లీ సమాధానం విని అంతా షాక్

By:  Tupaki Desk   |   8 Nov 2018 11:41 AM GMT
కోహ్లీ సమాధానం విని అంతా షాక్
X
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బర్త్ డే కానుకగా ఆయన పేరిట యాప్ విడుదలైంది. ఈ సందర్భంగా నెటిజన్లు పలు ప్రశ్నలను ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీని అడిగారు. తనకు వచ్చిన సందేశాలపై కోహ్లీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ‘ఇండియన్ బ్యాట్స్ మెన్ కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లీష్ ఆటగాళ్ల బ్యాటింగ్ నేను బాగా ఆస్వాదిస్తానని’ ఓ అభిమాని కోహ్లీని ప్రశ్నించారు. దీనిపై కోహ్లీ నోరు పారేసుకున్నాడు.. ‘వేరే దేశ క్రికెటర్లను అభిమానించే నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడైనా నివసించు. మనం దేశంలో ఎందుకున్నావ్? నువ్వు ఇతర దేశాల క్రికెటర్లను అభిమానించేటప్పుడు మన దేశంలో ఉండడంలో అర్థం లేదు’ అని కోహ్లీ నోరుజారాడు.

వేరే దేశ క్రికెటర్లను, దేశాలను ఇష్టపడవద్దని చెబుతున్న మీరు ఇండియాలో పుట్టి ఇటలీలో ఎందుకు పెళ్లి వేడుక చేసుకున్నారని ఓ అభిమాని కోహ్లీకి దిమ్మదిరిగేలా ప్రశ్నించాడు. మీరు నిజమైన భారతీయుడు, దేశం అంటే పిచ్చి ప్రేమ ఉన్న వారు అయితే ఇలా చేస్తారా అంటూ చురకలంటించాడు.

అయితే నోట్ల రద్దు సమయంలో కూడా విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘నోట్లో రద్దు సమయంలో రాజ్ కోట్ లో హోటల్ బిల్లు చెల్లించేటప్పుడు తన వద్ద పాత నోట్లు ఉన్నాయి.. అవి ఎందుకు చెల్లని చిత్తు కాగితాలు. అందుకే వాటి మీద తాను సంతకం చేసి తన అభిమానులకు ఇచ్చాను’ అంటూ భారత కరెన్సీని అవమానించేలా కోహ్లీ మాట్లాడడం వివాదాస్పదమైంది. పాతనోట్లను బ్యాంకుల్లో మార్చుకొని కొత్త నోట్లు పొందే వీలున్నా కోహ్లీ అలా చిత్తు కాగితాల్లా పంచడం దుమారం రేపింది.

విరాట్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిండా 30 ఏళ్లు కూడా లేని కోహ్లీ మైదానంలో దూకుడు చూపిస్తే ఎంజాయ్ చేస్తామని.. కానీ అదే దూకుడు బయట కూడా చూపిస్తే ఊరుకోమని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. వయసు పెరిగిన కొద్దీ పరిణతి చెందాలని సూచిస్తున్నారు. దూకుడు తగ్గించుకో.. సాటి ఇండియన్ ను వెళ్లిపోమ్మనే అధికారం కోహ్లీకి లేదని హెచ్చరిస్తున్నారు. అభిమానులను అభిమానించాల్సిన బాధ్యత నీ మీద ఉందని మర్చిపోకు అంటూ మండిపడ్డారు. భారతీయులకు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా ఉందని నీకు తెలియదా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇండియాలో ఉన్నంత మాత్రాన ఇతర దేశాల ప్రజలను ద్వేషించాలా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.