Begin typing your search above and press return to search.

కోహ్లీకి కోపమొచ్చింది..

By:  Tupaki Desk   |   23 Nov 2017 4:32 PM GMT
కోహ్లీకి కోపమొచ్చింది..
X
వరుస సిరీస్‌ లలో బిజీగా మారిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపమొచ్చింది. కోపం తట్టుకోలేకపోయిన ఆయన ఏకంగా బీసీసీఐపైనే తన ఆగ్రహాన్ని చూపించాడు. బీసీసీఐ పద్దతి పాడూ లేకుండా వరుసగా సిరీస్ లు నిర్వహించడంపై ఆయన విమర్శలు చేశాడు. బోర్డుకి ప్రణాళిక లోపించిందని... ఆ ప్రభావం ఆటగాళ్ల ప్రదర్శనపై పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

వచ్చే ఏడాది ఆరంభంలో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈలోగానే సొంత గడ్డ మీద శ్రీలంకతో సిరీస్ ఆడుతోంది. అయితే... లంకతో సిరీస్ ముగిసిన రెండు రోజులకే కోహ్లీ టీం దక్షిణాఫ్రికా బయలుదేరాల్సి ఉంటుంది. కోహ్లీ కూడా ఇదే విషయం చెబుతూ లంకతో సిరీస్ సుదీర్ఘంగా ఉండటం పట్ల ఆటగాళ్లకు ఊపిరి సలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఒకింత తీవ్రంగానే స్పందించాడు. క్రికెటర్లతో యంత్రాల్లా ఆడిస్తున్నారని.. ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమనే విషయాన్ని గుర్తించాలని సూచించాడు. నాకు కూడా విశ్రాంతి అవసరమే. నా శరీరం విశ్రాంతి కోరుకున్నప్పుడు తప్పకుండా రెస్ట్ తీసుకుంటా అని విరాట్ స్పష్టం చేశాడు. నేనేం రోబోను కదా అన్నాడు. కాగా బీసీసీఐపై బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ హోదాలో ఆయనలా బహిరంగ విమర్శలు చేయకపోవాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతుండగా, కొందరు మాత్రం కోహ్లీ చెప్పింది నూటికి నూరు శాతం వాస్తవమంటూ మద్దతు పలుకుతున్నారు.