Begin typing your search above and press return to search.

విజేందర్...! అరంగేట్రం అదిరిపోవాలి

By:  Tupaki Desk   |   10 Oct 2015 11:22 AM GMT
విజేందర్...! అరంగేట్రం అదిరిపోవాలి
X
భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ లోకి ప్రవేశిస్తున్నాడు... విజేందర్‌ తొలి బౌట్‌ శనివారం జరగబోతోంది... భారత కాలమానం ప్రకారం రాత్రి 10.20 గంటలకు మొదలవనున్న ఈ బౌట్ ను సోని సిక్స్ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది... మాంచెస్టర్‌లో జరిగే ఈ మ్యాచ్‌ లో ఇంగ్లండ్‌ కు చెందిన సోనీ వైటింగ్‌ తో విజేందర్‌ తలపడతాడు. 'వరల్డ్‌ వార్‌ 3'గా సోని సిక్స్‌ ప్రచారం చేస్తున్న ఈ బౌట్ పై భారత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మేలో మేవదర్‌, పాకియో మధ్య జరిగిన బౌట్‌ 'ఫైట్‌ ఆఫ్‌ ది సెంచరీ'గా సోని సిక్స్‌ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఒలింపిక్‌ విజేత, ప్రపంచ చాంపియన్‌ షిప్‌ లో పతకం సాధించిన విజేందర్‌ ఇందులో తలపడనుండడంతో దీనికి కూడా సోనీ సిక్స్ అమిత ప్రాధాన్యమిస్తోంది... విజేందర్, భారత్ అభిమానులు కూడా అంతకుమించి ప్రాధాన్యమిస్తున్నారు.

ప్రొఫెషనల్ బాక్సింగ్ అనేది భారత క్రీడాకారులకు ఇన్నాళ్లూ ఓ కల... భారత్ లోని బాక్సింగు అభిమానులు కూడా మైక్ టైసన్ - ఫోరమన్ - హోలీఫీల్డ్ - మేవదర్ వంటి యోధుల బాక్సింగ్ ను చూసి తమ బాక్సింగ్ క్రీడాసక్తిని చల్లార్చుకున్నారే కానీ భారతీయ బాక్సర్ ను మాత్రం ప్రొఫెసనల్ బాక్సింగ్ రింగులో చూడలేకపోయారు. విజేందర్ అరంగేట్రంతో ఇప్పుడు భారతీయుల కల నెరవేరబోతోంది. ఒలింపిక్స్ పోటీల్లో బాక్సింగ్‌ లో దేశానికి తొలి పతకం అందించిన విజేందర్... భారత బాక్సింగ్‌ లో కొత్త అధ్యాయానికి తెర తీస్తున్నాడు. దీంతో ఇండియన్ అభిమానులు గాల్లోకి పంచ్ లు విసురుతూ సంతోషాన్ని చాటుకుంటున్నారు.

నిజానికి భారత్ లో బాక్సింగ్ అంతంతమాత్రంగా ఉంది. బీజింగ్ ఒలింపిక్స్‌ లో విజేందర్ సింగ్ కాంస్యం పతకం సాధించిన తర్వాత భారత్‌ లో బాక్సింగ్ ఒక్కసారిగా ఊపందుకుంది. వేలాదిమంది ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. బాక్సింగులో మనకంత సీను లేదులే అనుకున్నవారు కూడా విజేందర్ ను చూసి ఆనాడే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారి ఆశలు, కలలు నిజం కాబోతున్నాయి. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రొఫెషనల్ బాక్సింగు లో భారత్ అడుగుపెట్టడమే గొప్ప విజయంగా భావిస్తున్నారు.

తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌ లోనే పతకం సాధించి స్టార్‌ గా మారిపోయిన విజేందర్ అమెచ్యూర్ బాక్సింగ్‌ ను దాటి ప్రొఫెషనల్ పోటీల వైపు అడుగుపెడుతున్నాడు. డబ్బుకు డబ్బు పేరుకు పేరు దక్కే ఈ పోటీలు అంత ఆషామాషీ కానప్పటికీ విజేందర్ గట్టి పట్టుదలతో ఇందులో అడుగుపెడుగుతున్నాడు.

విజేందర్ తొలినుంచీ బాక్సింగ్ ను కెరీర్ గా ఎంచుకుని ఎదగాలని తపించాడు. డిగ్రీ కాగానే భివాని బాక్సింగ్ క్లబ్‌ లో చేరి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నాడు. ఆ తరువాత భారత జాతీయ కోచ్ గురుబక్ష్ సింగ్ శిక్షణలో మరింతగా రాటుదేలాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో స్టార్ గా మారిపోయాడు. 2009లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు. అదే ఏడాది రాజీవ్ ఖేల్ రత్న, 2010లో పద్మశ్రీ పురస్కారాలు అతని సొంతమయ్యాయి. అయితే.... విజేందర్ ప్రొఫెషనల్‌ గా మారడంపై విమర్శలూ ఉన్నాయి. డబ్బు కోసమే ఆయన ఇలా మారుతున్నాడంటున్నారు. ఇక దీన్నే కెరీర్‌ గా మల్చుకునే ఆలోచనలో ఉన్న విజేందర్, తొలి బౌట్ కోసం కొన్ని నెలలుగా ప్రఖ్యాత కోచ్ లీ బియర్డ్ శిక్షణలో కఠోరంగా శ్రమిస్తున్నాడు.

మరోవైపు తన తొలి ప్రొఫెషనల్ బౌట్ లో విజేందర్ గెలుస్తాడన్న అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి కారణం విజేందర్ ప్రత్యర్థి సన్నీ వైటింగ్‌కు కూడా ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పెద్దగా అనుభవం లేకపోవడమే. ఇంగ్లండ్‌కు చెందిన సన్నీ ఇప్పటి వరకు కేవలం మూడు బౌట్లలో మాత్రమే పాల్గొన్నాడు. అందులో రెండు గెలిచి ఓ దాంట్లో ఓడాడు. అయితే తొలి మ్యాచ్‌ లో ప్రత్యర్థిని నాకౌట్ చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. మరోవైపు ప్రొఫెషనల్ బాక్సర్‌ గా విజేందర్ క్వీన్స్ బెర్రీ సంస్థతో ఈ ఏడాది జూన్ 29న ఒప్పందం చేసుకున్నాడు. విజేందర్ కోట్లాది భారతీయుల కలలు నెరవేరుస్తాడో లేదో ఈ రాత్రికి తేలిపోనుంది.