Begin typing your search above and press return to search.

ఏపీ తీర్మానానికి తెలంగాణ‌కు లింకేసిన రాముల‌మ్మ‌!

By:  Tupaki Desk   |   14 Jun 2019 7:15 AM GMT
ఏపీ తీర్మానానికి తెలంగాణ‌కు లింకేసిన రాముల‌మ్మ‌!
X
మ‌నం ఎలా చూస్తే అలా కనిపిస్తుంద‌న్న నానుడికి త‌గ్గ‌ట్లే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ఆయువుప‌ట్టు మీద దెబ్బేసిన గులాబీ బాస్ పుణ్య‌మా అని.. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో దారుణ ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్‌. ఒక్క‌సారిగా ప‌న్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని విలీనం పేరిట తెలంగాణ అధికార‌ప‌క్షంలో క‌లిసిపోయిన వైనంపై ఆ పార్టీలో మిగిలిన వారంతా అగ్గి మీద ప‌డ్డ గుగ్గిలంగా మారారు.

ఇదిలా ఉంటే.. ఏపీలో రాజ‌కీయాల్ని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేయ‌టంతో పాటు.. కొన్ని ఆద‌ర్శాల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెబుతున్నారు జ‌గ‌న్‌. నోటి మాట‌ల‌తో కాకుండా చేత‌ల‌తో ఆయ‌న పార్టీ ఫిరాయింపుల విష‌యంపై అసెంబ్లీలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌ప్పుడు ఫిరాయింపుల బాధితుడైన జ‌గ‌న్ కు.. ఆ తీరు ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిందే.

అందుకే.. త‌మ‌కు అవ‌కాశం ఉన్నా ఫిరాయింపుల్ని ప్రోత్స‌హించేది లేద‌ని.. ఎవ‌రినైనా పార్టీలో చేర్చుకుంటే వారి చేత రాజీనామా చేయించిన త‌ర్వాత మాత్ర‌మే పార్టీలో చేర్చుకుంటామ‌ని తేల్చి చెప్పారు. జ‌గ‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతి ఆస‌క్తిక‌ర రీతిలో రియాక్ట్ అయ్యారు.

ఫేస్ బుక్ లో సుదీర్ఘ పోస్టు పెట్టిన ఆమె.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌మంటూ జ‌గ‌న్ చ‌ర్య‌ను స‌మ‌ర్థించారు. అదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు జ‌గ‌న్ నిర్ణ‌యం చెంప‌పెట్టు లాంటిదంటూ రెండింటికి ముడి వేయ‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి.

పార్టీ ఫిరాయింపుల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల‌కొన్న ప‌రిస్థితిని త‌న పోస్టుతో చెప్పేశారు విజ‌య‌శాంతి. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి ఐదేళ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి వింత‌గా ఉంద‌ని.. ఒక‌వైపు బంగారు తెలంగాణ పేరుతో అన్ని రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా ఉంటామ‌ని చెప్పిన టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌జాస్వామ్యాన్ని హ‌త్య చేశార‌ని మండిప‌డ్డారు.

స్పీక‌ర్ ను అడ్డుగా పెట్టుకొని పార్టీ ఫిరాయింపులు ప్రోత్స‌హించిన తీరుపై కోర్టు సైతం నోటీసులు ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. మ‌రోవైపు ఏపీకి కొత్త ముఖ్య‌మంత్రిగా అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. స్పీక‌ర్ ను ఎన్నుకొని ఆయ‌న ప‌ద‌విలో కూర్చున్నంత‌నే అధికార‌ప‌క్షం త‌ర‌ఫున కీల‌క‌మైన తీర్మానం చేయ‌టం దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌న్నారు.

పార్టీ ఫిరాయింపులు ఎట్టి ప‌రిస్థితుల్లో ప్రోత్స‌హించే ప్ర‌స‌క్తే లేద‌ని.. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు ఎవ‌రైనా పార్టీ మారాల‌నుకుంటే రాజీనామా చేసి రావాల‌ని జ‌గ‌న్ తీసుకున్న‌ నిర్ణ‌యం తెలంగాణలో అధికార‌ప‌క్షానికి చెంప పెట్టులాంటిద‌న్నారు. త‌న‌ను చూసి దేశంలోని మిగిలిన రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పాఠాలు నేర్చుకోవాల‌ని డైలాగులు చెప్పే కేసీఆర్‌.. ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు ఏ ర‌కంగా స్పందిస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు. చూస్తుంటే.. రెండు రాష్ట్రాల సీఎం జుట్ల‌కు ముడి వేస్తున్న రాముల‌మ్మ తీరు రానున్న రోజుల్లో ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో చూడాలి.